ఆంధ్రప్రదేశ్ వ్యవసాయక రాష్ట్రం. సాగుమీద ఆధారపడే కుటుంబాలే ఎక్కువ. పారిశ్రామికీకరణ లేదు. రియల్ ఎస్టేట్ లేదు. ఉద్యోగాల్లేవ్. వ్యవసాయాన్ని అయినా ప్రభుత్వం సక్రమంగా సాగనిస్తుందా అంటే.. అదీ లేదని.. ప్రయోగాలు చేసి చేసి.. రైతుల్ని అప్పుల కుప్ప చేసిందని తేలిపోయింది. దేశంలో అత్యధిక రుణభారం ఏపీ రైతులపైనే ఉంది.ఈ విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పింది. ఒక్కో ఏపీ రైతుపై సగటున రెండున్నర లక్షల రుణభారం ఉంది. అదే తెలంగాణకు వచ్చే సరికి ఆ రుణభారం.. రూ. లక్షన్నర మాత్రమే.
ఏపీ రైతులు ఇలా దేశంలోనే అత్యధిక అప్పులు ఉన్న రైతులుగా మారిపోవడానికి వంద శాతం ప్రభుత్వ విధానాలే కారణం. గతంలో ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ రద్దు చేసి .. ఏడాది కాలానికి మూడు విడతలుగా రూ. ఏడున్నర వేలు మాత్రమే ఇస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్లు లేవు.. పంటరాయితీలు లేవు.. బోర్లు వేయించేది లేదు.. సబ్సిడీ ఎరువులు లేవు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రభుత్వం రైతులకు సాధారణంగా చేయాల్సిన ఏ సాయమూా చేయడం లేదు.
ఇంకా దారుణం ఏమిటంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు.. నష్టపోయిన రైతులకు పైసా సాయం చేయడం లేదు. ఏ సీజన్ లో సాయం ఆ సీజన్ లోనే నంటూ… ఇన్ పుట్ సబ్సిడీ బటన్ నొక్కుతారు. దాని వల్ల రైతులకు వచ్చేది ..నాలుగు, ఐదు వందల రూపాయలు మాత్రమే. గతంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కనీసం ఎకరానికి నాలుగైదు వేలు ప్రభుత్వం ఇచ్చి రైతుల్ని ఆదుకునేది. ఆ సమయంలో జగన్ .. ఆ ఐదు వేలు ఎలా సరిపోతాయని పాతిక వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన సీఎం అయ్యాక.. ఆ ఐదు వేలు కూడా ఆపేశారు.
రైతులు ఇప్పుడు ధాన్యం కొనేవారు లేకు తంటాలుపడుతున్నారు. ప్రభుత్వం కొనే అరకొరధాన్యానికి డబ్బులు చెల్లించడం లేదు. మిల్లర్ల బారిన పడిన రైతులు నష్టపోతున్నారు. ఏ విధంగా చూసినా వ్యవసాయరంగాన్ని కొంత మంది సిండికేట్ అయి దోచుకుంటున్నారు. రైతులు మాత్రం అప్పుల పాలవుతున్నారు.