చంద్రబాబునాయుడు బీజేపీతో పొత్తు కోసమే తెలంగాణలో బలప్రదర్శన చేస్తున్నారని ఖమ్మంలో బహిరంగసభ తర్వాత అటు బీఆర్ఎస్ నేతలు.. ఇటు వైసీపీ నేతలు ఒకే మాట వినిపించారు. హరీష్ రావు ఏమన్నారో ఖచ్చితంగా సజ్జల కూడా అదే అన్నారు. బీజేపీతో పొత్తు కోసమే చంద్రబాబు తాపత్రయపడున్నారని అన్నారు. ఇప్పుడు ఇదే మాటను ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సమర్థిస్తున్నారు. అది నిజమే అంటున్నారు. తెలంగాణలో టీడీపీకి బలం ఉన్నా.. సీట్లు గెలుచుకునేంత ఉండదు. కానీ ఆ బలం గెలుపోటముల్ని తారుమారు చేయగలదని.. తమతో పొత్తు పెట్టుకునేలా చేయాలని ఆయన బీజేపీని ఫోర్స్ చేసేందుకు సభలు పెట్టారని అంటున్నారు. అదే సమయంలో ఏపీలో కూడా బీజేపీతో పొత్తు కోరుకుంటున్నారని అక్కడ ఆ పార్టీకి ఓట్లు లేకపోయినా… జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో అక్రమాలు చేయకుండా అడ్డుకోవడానికి బీజేపీ మద్దతు అవసరం అని చంద్రబాబు భావిస్తున్నారని ఆర్కే తేల్చేశారు.
చంద్రబాబుకు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఉందో లేదో ఆయన ఎప్పుడూ బయటపడలేదు.. కానీ ఆర్కే మాత్రం తేల్చేశారు. ఈ వారం కొత్త పలుకులో ఖమ్మం సభపై బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యల కేంద్రంగానే విశ్లేషణ చేశారు. టీడీపీ వల్ల బీఆర్ఎస్ కు ముప్పు ఉంటుందన్న భయంతోనే.. జాతీయ పార్టీగా మారిపోయినప్పటికీ ప్రాంతీయ వాదంతో వ్యాఖ్యలు చేస్తున్నారని.. తమను తాము కించపర్చుకుంటున్నారని తేల్చేశారు. అదే సమయంలో కేసీఆర్ భేటీల వ్యవహారాన్నీ నిశితంగానే విమర్శించారు. ప్రగతి భవన్ లో తెలంగాణ వారికి ప్రవేశం ఉండదు కానీ.. ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో ఇతర రాష్ట్రాల వారిని పిలిచి పొట్టేలు మాంసంతో విందులు పెడుతున్నారని ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా వ్యాఖ్యలు చేశారు.
ఏపీ నుంచి కేసీఆర్ ను కలిసిన వారు ఎవరో ఎవరికీ తెలియదు. కొన్ని సంఘాలకు అధ్యక్షులు అని చెప్పుకున్నారు. వారినే ప్రగతి భవన్ కు పిలిపిచి.. ఫోటోలు దిగి.. ఆంధ్రాకూ ఆశాకిరణం అని నమస్తే తెలంగాణలో రాసుకోవడంపై ఆర్కే సెటైర్లు వేశారు. ఆయనను కలిసిన వారిలో మూతపడిన పత్రికలో కంట్రిబ్యూటర్ గా పని చేసిన వ్యక్తి కూడా ఉన్నారని.. అలాంటి వారికికూడా తెలంగాణ భవన్ లో విందులు లభిస్తున్నాయని.. వారితో కేసీఆర్ ఏం చేస్తారని ఆర్కే ప్రశ్నించారు.
చివరిలో ఆర్కే… ఏపీ ప్రజలు మాయమాటలకు పడిపోతారేమో కానీ.. తెలంగాణ ప్రజల్ని మాత్రం ఎల్ల కాలం మోసం చేయలేరన్న ఓ హెచ్చరికను మిత్రుడు కేసీఆర్కు పంపారు. ఆయన పట్టించుకుంటారో లేదో..?