టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు చలపతిరావు (78) హఠాన్మరణం చెందారు. హైదరాబాద్లోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
1944 మే8న కృష్ణా జిల్లా బల్లిపర్రులో జన్మించిన చలపతిరావు.. నటుడు, నిర్మాతగా గుర్తింపు పొందారు. 600కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. 1966లో విడుదలైన ‘గూఢచారి 116’ సినిమాతో ఆయన చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. దాదాపు అగ్ర హీరోలందరీ చిత్రాల్లో ఆయన సహాయనటుడిగా, ప్రతినాయకుడిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
చలపతిరావుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు రవిబాబు దర్శకుడు, నటుడు, నిర్మాతగా ఉన్నారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన కుమారుడు రవిబాబు ఇంట్లో చలపతిరావు ఉంటున్నారు.
రెండు రోజుల క్రితమే సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతిచెందగా.. ఇప్పుడు చలపతిరావు ఆకస్మిక మరణంతో టాలీవుడ్ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
చలపతిరావు కుమార్తె అమెరికా నుంచి వచ్చిన తర్వాత బుధవారం చలపతిరావు అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.