తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మొహమాటాలు, నాన్చుడు లేకుండా సీనియర్లకు చెప్పాలన్నది చెబుతున్నారు. సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవలందిస్తున్నారన్న కారణంగా ప్రజల్లో పట్టు కోల్పోయినా గెలుపు అవకాశాలు లేకపోయినా చంద్రబాబు సీనియర్లకు చాన్సులిచ్చారు. విజయవాకాశాలను బేరీజు వేసుకుంటున్న టీడీపీ అధినేత ఇకపై మొహమాటానికి పోకూడదని తీర్మానించుకున్నారు. అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని చూస్తున్నారు.
ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుటుంబ విషాదాల వల్ల యాక్టివ్ గా లేరు. ఈ సారి ఏలూరు ఎంపీ టిక్కెట్ కు ఆయనను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలువురు మాజీలకు టికెట్లు లేవని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్రలోనూ పలువురు సీనియర్లకు ఈ సారి టిక్కెట్ డౌటేనని చెబుతున్నారు. యనమల కుటుంబానికి.. కళా వెంకటరావుకు కూడా చాన్స్ లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం టీడీపీ నేతలను తీవ్ర వేధింపులకు గురి చేసింది. కొంత మంది పోరాడారు కానీ ఎక్కువ మంది సైలెంట్ అయ్యారు. వీళ్లని కూడా చంద్రబాబు పరిగణనలోకి తీసుకోవడం లేదు. కార్యకర్తలను సంఘటితంగా ఉంచడంలో విఫలమైన మాజీలే ఎక్కువమంది ఉన్నారని టీడీపీ అధిష్టానం లెక్కగట్టింది. కొందరికి టికెట్ లేదని చెబుతున్నారు. పని చేసిన వారికి మాత్రం టికెట్ ఖాయమని నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచే సమర్థంగా పనిచేయాలని సూచిస్తున్నారు. గెలిచే అవకాశం ఉన్న తటస్థులను తీసుకొచ్చి ఎన్నికల్లో నిలబెట్టేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే గుడివాడలో రాము అనే ఎన్నారై పని కూడా ప్రారంభించారు. ఇలాంటి వారు ఇంప్రెస్ చేస్తే వారికి టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఉంది.