కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టక మునుపే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీ వెళ్లి ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని, ప్రధాని నరేంద్ర మోడిని కలిసి రాష్ట్రానికి ఇచ్చిన హామీల గుర్తుచేసి, రాష్ట్ర అవసరాలకు తగినన్ని నిధులు బడ్జెట్ లో కేటాయించమని కోరేరు. కానీ మోడీ, జైట్లీ ఇద్దరూ కూడా ఆయన విజ్ఞప్తులను పట్టించుకోలేదని బడ్జెట్ చూస్తే అర్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శంఖుస్థాపన చేసిన ఉన్నత విద్యాలయాలు అన్నిటికీ ఈ బడ్జెట్ లో సముచితమయిన కేటాయింపులు చేసారు తప్ప పోలవరం, మెట్రో రైల్ వంటి పెద్ద ప్రాజెక్టులకి అరకొర కేటాయింపులతోనే సరిపెట్టేశారు.
చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి ప్రధానిని, ఆర్ధికమంత్రిని కలిసినా ఆయన మాటను వారు పట్టించుకోలేదు అంటే ఆయన మాటకు వారు ఏ మాత్రం విలువ, గౌరవం ఈయడం లేదనే విషయం స్పష్టమయింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయన తమని కలవడానికి వచ్చినప్పుడు ఆయన విజ్ఞప్తులను వినక తప్పదు గాబట్టి వారు విన్నట్లుంది తప్ప అంతకంటే మరే ప్రయోజనం కనబడలేదు.
రాష్ర్టంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా డిల్లీ వెళ్లి అందరినీ కలిసి విజ్ఞప్తులు చేసి వచ్చేరు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు విజ్ఞప్తులనే చెత్తబుట్ట దాఖలు చేస్తున్నప్పుడు జగన్ చేసిన విజ్ఞప్తిని పట్టించుకొంటారని ఆశించలేము. కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నేత అయినా వారి దృష్టిలో ఒకటేనని స్పష్టమవుతోంది. ఈవిధంగా వారిద్దరి విజ్ఞప్తులను మోడీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం రాష్ట్ర ప్రజలకు అవమానకరంగానే భావించవలసి ఉంటుంది.
కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలను ఎప్పుడూ చిన్న చూపు చూస్తూనే ఉన్నాయి. మిత్రపక్షాలుగా ఉన్న తెదేపా, బీజేపీలను ఎన్నుకొన్నట్లయితే, విభజన కారణంగా దెబ్బ తిన్న రాష్ట్రాన్ని నరేంద్ర మోడీ ఉదారంగా ఆదుకొంటారనే ఉద్దేశ్యంతోనే ప్రజలు తెదేపా-బీజేపీ కూటమికి ఓటేసి గెలిపించారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు ఒక్కో హామీకి ఒక్కో సాకు చూపిస్తూ పక్కన పెడుతున్నారు. హామీలను అమలు చేయలేకపోయినప్పటికీ ఆర్ధికంగా చితికిపోయున్న రాష్ట్రం తిరిగి తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే వరకు ఆదుకొన్నా ప్రజలు సంతోషించేవారు.
ఈ నేపధ్యంలో రాష్ట్రంలో బీజేపీ ఏవిధంగా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని కలలు కంటోందో తెలియదు కానీ అందుకోసం మార్చి ఆరో తేదీన రాజమండ్రిలో బహిరంగ సభ నిర్వహించబోతోంది. రైల్వే బడ్జెట్, ఆర్ధిక బడ్జెట్ రెంటిలో కూడా రాష్ట్రానికి న్యాయం చేయలేకపోయిన బీజేపీ నిర్వహించే ఆ సభకి ప్రజా స్పందన ఏవిధంగా ఉంటుందో చూడాలి!