టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసేశారు. కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోకి ఎలా ఎంట్రీ ఇవ్వాలన్న దానిపై కేసీఆర్ కు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఢిల్లీలో ఆయన పార్టీ కార్యాలయం ప్రారంభానికి విపరీతమైన బజ్ వస్తుందని అనుకున్నారు. కానీ అక్కడ కూడా తెలంగాణ వారు తప్ప… కనీసం ఏపీ నేతలు కూడా పట్టించుకోలేదు. అఖిలేష్ యాదవ్, కుమారస్వామి వచ్చినా.. రెండు మంచి మాటలు చెప్పడానికి తప్ప వారు బీఆర్ఎస్ విస్తరణకు ఏ కోశానా సహకరిస్తారన్న ఆశలు బీఆర్ఎస్ పార్టీనేతల్లో లేవు.
తెలంగాణలో అధికార పార్టీ.. ఆర్థికంగా మంచి దన్ను ఉన్న పార్టీ .. జాతీయస్థాయిలో వస్తోంది.. అన్ని రాష్ట్రాల్లో శాఖలు పెట్టాలనుకుంటోందని.. ఇతర పార్టీల్లో ఉన్న అంతో ఇంతో బలమన అభ్యర్థులు వచ్చి.. కర్చీఫ్ వేసుకోవడం సహజం. కానీ టీఆర్ఎస్ విషయంలో అలా జరగడం లేదు. ఏ ఒక్క నేతా ఆసక్తి చూపించడం లేదు. చివరికి ఏపీ నుంచి కూడా అదే పరిస్థితి. ముక్కూ ముఖం తెలియని నలుగుర్నిఏపీ నుంచి ప్రగతి భవన్ నుంచి పిలిపించుకుని వారే పెద్ద ప్రముఖులన్నట్లుగా సొంత పత్రిక బ్యానర్ గా వేసుకోవడంతో.. బీఆర్ఎస్ మొదటే తేలిపోయినట్లయిందన్న వాదన వినిపిస్తోంది.
ఇప్పుడు ప్రత్యేకంగా రాష్ట్ర కార్యవర్గాలను నియమించడానికి ఓ స్థాయి నేతలెవరూ ముందుకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో.. కేసీఆర్ ముందుగా కిసాన్ సెల్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఆరు రాష్ట్రాలకు కిసాన్ సెల్స్ ను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఆ ప్రకటన ఎప్పుడైనా రావొచ్చు. నెలాఖరులోపు ఢిల్లీ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి.. బీఆర్ఎస్ విధానాలను మీడియా ముందు పెట్టాలనుకుంటున్నారు. ఇయర్ ఎండింగ్ లో అలాంటి ప్రెస్ మీట్ కు ప్రాధాన్యత లభిస్తుందా లేదా అనే సందేహం ఉంది. మొత్తంగా కేసీఆర్ మాత్రం.. బీఆర్ఎస్ విస్తరణలో మాత్రం వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే వినిపిస్తోంది.