నోట్లు రద్దు చేయడం కరక్టేనని సుప్రీంకోర్టు తెల్చి చెప్పింది. సుప్రీంకోర్టులో ఈ అంశం పై జరిగిన విచారణ వేరు. కేంద్రం నేరుగా ఈ నిర్ణయం తీసుకోవడం చట్టపరమా కాదా అనే అంశంపైనే జరిగింది. సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు ఆర్బీఐ తీసుకోవాలి. కానీ కేంద్రం తీసుకుంది. ప్రధాని ప్రకటించారు. అమలు చేశారు. నోట్ల మార్పిడికి అతి కొద్ది సమయం ఇచ్చారు. ఇలాంటి అంశాలపై విచారణ జరిగింది. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పు చెప్పింది. ఐదుగురు న్యాయమూర్తుల్లో ఒక్కరు మాత్రమే భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నోట్ల రద్దు తప్పు అని సుప్రీంకోర్టు చెబుతుందని ఎవరూ అనుకోలేదు. ఆ నిర్ణయం తప్పు అని కూడా అనుకోరు. కానీ ఆ నిర్ణయం వల్ల శిక్షకు గురైన వారు చేసిన తప్పేంటి ? అన్నది మాత్రం ఇక్కడ ఎవరూ ఆలోచించడం లేదు.
నోట్ల రద్దు వల్ల శిక్ష అనుభవించిన ప్రజలు చేసిన తప్పేంటి ?
రాత్రికి రాత్రి తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశంలో ఇబ్బంది పడని ఒక్క వ్యక్తి కూడా లేరంటే అతిశయోక్తి కాదు. రోజు కూలీ నుంచి కుబేరుడు వరకూ అందరూ ఇబ్బందిపడ్డారు. కుబేరులు ఎంత ఇబ్బంది పడినా.. వారి స్థాయిలో వారు పరిష్కారాలను అధికారమే చూపిస్తుంది. కానీ సామాన్యుల పరిస్థితేమిటి? చెల్లుబాటయ్యే ఒక్క నోటు కోసం ఏటీఎంల దగ్గర పడిగాపులు కాస్తూ చనిపోయిన వారి సంగతేంటి ? బ్యాంక్ క్యూ లైన్లలో చనిపోయిన వారి సంగతేంటి ? బ్యాంకుల్లో డబ్బులు ఉన్నా చేతుల్లో డబ్బులు లేక.. కుటుంబసభ్యులకు వైద్యం చేయించుకోలేకపోయిన వారి మానసిక వేదనకు ఎవరు బాధ్యులు? బ్యాంకులో కావాల్సినంత డబ్బులు ఉన్నా.. బయట ఆకలి తీర్చుకోవడానికి చిల్లర దొరకక తిప్పలు పడిన వారి బాధ ఎవరికి పడుతుంది ?. ఈ బాధలు పడిన వారు శిక్ష అనుభవించినట్లే. వారు చేసిన తప్పేంటి ?
నోట్ల రద్దు వల్ల రోడ్డున పడ్డ వారు చేసిన తప్పేంటి ?
నోట్ల రద్దు అనే నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ఓ బండపడింది. కొన్ని వందల చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. కొన్ని కోట్ల ఉద్యోగాలు పోయాయని అనేక రిపోర్టులు వెల్లడించాయి. దేశం ఆర్థికంగా నాలుగేళ్లు వెనక్కి పోయిందని కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని ఈ లోపు ఎన్నో కుటుంబాలు ఉపాధి కోల్పోయి బీదరికంలోకి చేరిపోయాయనన్న విశ్లేషణలు వచ్చాయి. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు. ఈ కుటుంబాలు నోట్ల రద్దు వల్ల అనుభవించిన శిక్ష అంతా ఇంతా కాదు. వారు చేసిన తప్పేంటి ?
బ్లాక్ మనీ బయటకు రాలేదు.. నోట్ల చెలామణి తగ్గలేదు.. నోట్ల రద్దు వల్ల ఇంకేంటి లాభం ?
నోట్ల రద్దు ఎందుకు అంటే కేంద్రం ఇప్పటికీ స్పష్టమైన కారణం చెప్పడం లేదు. యాభై రోజులు గడువు ఇవ్వండి లేకపోతే నన్ను నిలువునా తగులబెట్టండి అని మోదీ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. మొదట నల్లధనం బయటకు వస్తుందన్నారు. కానీ మార్కెట్లో ఉన్న డబ్బులన్నీ బ్యాంకుల్లో చేరి వైట్ అయిపోయాయి. ఒక్కరిపై బ్లాక్ మనీ కేసు పెట్టలేదు. డిజిటల్ లావాదేవీలు పెంచడానికి.. నోట్ల చెలామణి తగ్గించడానికన్నారు. ఇప్పుడు నోట్లు రెండింతలయ్యాయి. కశ్మీర్ లో ఉగ్రవాదులు దొంగ నోట్లు ముద్రించకుండా అన్నారు.. కానీ ఇప్పుడు అవి వస్తూనే ఉన్నాయి. అంటే.. నోట్ల రద్దుకు తీసుకున్న ఏ నిర్ణయానికి ప్రాతిపదిక లేదు. అంతిమంగా నిర్ణయం కరెక్టే. .. అయినా ఏ తప్పు చేయని ప్రజలే శిక్ష అనుభవించారు.