ఏపీలో బీఆర్ఎస్ శాఖ ఏర్పాటయింది. తోట చంద్రశేఖర్ ను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా చేరిన వారంతా కాపు సామాజిక వర్గ నాయకులే. దీంతో అసలు ఏపీలో కేసీఆర్ రాజకీయ లక్ష్యం ఏమిటన్నది మిస్టరీగా మారింది. ప్రతీ రాజకీయ పార్టీకి కొంత ఓటు బ్యాంక్ ఉండాలి. లేకపోతే బలం లేనట్లుగా భావిస్తారు. ప్రస్తుతం కాపు సామాజికవర్గ బలం.. జనసేన పార్టీకి ఉందని చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఆ పార్టీ ఓటు బ్యాంక్ నే కేసీఆర్ టార్గెట్ చేశారు. తోట చంద్రశేఖర్ ను పార్టీలో చేర్చుకోవడంతో పాటు కాపు సంఘం నేతల్ని.. ఇతరుల్ని కూడా చేర్చుకున్నారు . వీరిలో ఎక్కువ మంది జనసేన నేతలే. దీంతో కేసీఆర్ లక్ష్యం జనసేనను వీక్ చేయడమేనన్న చర్చ జరుగుతోంది.
ఓ వైపు బీఆర్ఎస్లో కాపు నేతల్ని చేర్చుకుంటున్న సమయంలో వైసీపీ నేతలు.. ఏపీలో ఏ రాజకీయ పార్టీ చేయనంతగా హడావుడి చేసింది. బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. ఏపీ కరెంట్ ను దొంగతనం చేస్తున్న కేసీఆర్ ఏపీకి వచ్చి ఏం చేస్తారని పేర్ని నాని లాంటి వాళ్లు ప్రశ్నించారు. రోజా కూడా అంతే. కేసీఆర్ ను నగరిలో ఉంటికి పిలిచి మాంసాహారం వడ్డించడమే కాదు.. చాలా సందర్భాల్లో ప్రగతి భవన్ కు వెళ్లి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. అయినా ఇప్పుడు విమర్శలు ప్రారంభించారు. ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతున్న ప్రక్రియ అని ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ ప్రారంభమయింది.
ఏపీలో జనసేన పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగినా వైసీపీ తుడిచి పెట్టుకుపోతుందన్న చర్చ జరుగుతోంది. ఈ కారణంగా ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకోకుండా వైసీపీ అనేక ఎత్తులు వేస్తోంది. దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి అని అదే పనిగా సవాళ్లు విసురుతున్నారు. ఇప్పుడు పొత్తులు పెట్టుకున్నా ఓట్లు చీల్చగలిగితే చాలన్న పద్దతిలో.. రాజకీయంగా ఆప్తమిత్రుడైన కేసీఆర్.. ప్రారంభింంచిన బీఆర్ఎస్ ను పాచికలుగా వాడుతున్నారన్న చర్చ జరుగుతోంది. హైదరాబాద్ లో వ్యాపారాలు.. ఏపీలో కోసులు ఉన్న కాపు నేతల్ని బీఆర్ఎస్ లో చేరేలా ప్రోత్సహిస్తున్నారని.. దీని వెనుక వైసీపీ ఉందన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి.
ఏపీలో బీఆర్ఎస్ శాఖ ప్రారంభంపై ఇతర రాజకీయ పార్టీలు సీరియస్ గా తీసుకోలేదు. పెద్దగా పట్టించుకోలేదు. తెలంగాణలోనే బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా ఉందని.. ఇక కేసీఆర్ రాజకీయమే .. ఏపీని ద్వేషించడం మీద ఆధారపడి ఉందని.. అలాంటి ద్వేషం చిమ్మిన నేతకు ఏపీలో ఓట్లు ఎవరు వేస్తారని.. పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నాయి. కానీ వైసీపీ మాత్రం ప్రయారిటీ ఇచ్చి మరీ మాటల దాడి చేస్తోంది.