తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ , హ్యాకింగ్ అంశం మరోసారి మెల్లగా హాట్ టాపిక్ గా మారుతోంది. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ .. ఐ ఫోన్ ఇటీవల హ్యాకింగ్ కు గురైంది. ఈ విషయాన్ని యాపిల్ సంస్థ ఆయనకు మెయిల్ ద్వారా డీటైల్స్ పంపింది. స్టేట్ అంటే ప్రభుత్వమే ఇలా చేస్తోందని యాపిల్ సంస్థ పేర్కొంది. అయితే ఏ ప్రభుత్వం అన్నది చెప్పలేదు. యాపిల్ సంస్థ పంపిన మెయిల్ ను సోషల్ మీడియాలో పెట్టిన ప్రవీణ్.. కేసీఆర్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. దీన్ని అలా వదిలి పెట్టడం లేదు.
తాజాగా తెలంగాణ రాజకీయ పార్టీలకు సేవలు అందిస్తున్న ఓ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఫోన్ కూడా హ్యాక్ చేసే ప్రయత్నం చేశారని.. యాపిల్ తెలిపిందని.. ఆయన బయట పెట్టారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్అనేది విస్తృతంగా జరుగుతోందని.. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. నిజానికి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్‌పై గట్టి అనుమానాలే ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు ఫోన్ వాయిస్ బయటకు వచ్చినప్పుడే కలకలం రేగింది. మళ్లీ ఇటీవల ఫామ్ హౌస్ కేసు తర్వాత ఇది మరింత తీవ్రమైంది.
కేసీఆర్ కొన్ని వేల పేజీల డాక్యుమెంట్లు, ఆడియో పైల్స్, వీడియో ఫైల్స్ ను బయటపెట్టడం సంచలనం అయింది. ఇదంతా హ్యాకింగ్ చేయడం ద్వారానే సాధ్యమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై సీబీఐ విచారణ జరపబోతోందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రవీణ్ కుమార్ వ్యూహాత్మకంగా ఐ ఫ్యాన్ హ్యాకింగ్ గురించిన విషయాలను బయట పెడుతూ ఆరోపణలు చేస్తున్నారు.