ఏపీలో పర్యటించాలని షెడ్యూల్ ఖరారు చేసుకున్న అమిత్ షా చివరి క్షణంలో రూట్ మార్చుకున్నారు. కర్ణాటకలో బీజేపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున ఏపీకి కేటాయించి ఆ ఒక్క రోజు కర్ణాటకకు కేటాయించాలని అనుకున్నారు. దీంతో అమిత్ షా టూర్ వాయిదా వేసినట్లుగా ప్రకటించారు. నిజానికి అమిత్ షా టూర్ మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఖరారైంది. ఏపీ బీజేపీ నేతలకు సమాచారం వచ్చింది. 8న కర్నూలు, అనంతపురం జిల్లాలో ఐదు కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారిక సమాచారం ఇచ్చారు.
వెంటనే బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రంగంలోకి దిగి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కర్నూలు వెళ్లి సభా స్థలాన్ని పరిశీలించారు. అమిత్ షా పర్యటనలో ప్రజలు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలా పిలుపునిచ్చి ఆయన హోటల్ రూమ్ కు వెళ్లే సరికి. .. అమిత్ షా పర్యటన క్యాన్సిల్ అయిందని సమాచారం వచ్చింది. దీంతో సోము వీర్రాజు ఊసురుమన్నారు.
ఏపీలో పర్యటించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండని .. సమయం దండగని అమిత్ షా అనుకున్నారో లేకపోతే.. .. అమిత్ షా ఏపీకి వస్తే ఇబ్బంది పడతామని పార్టీయేతరులు ఎవరైనా సమాచారం పంపారో కానీ… మొత్తం షెడ్యూల్ ఖరారు చేసుకున్నాక…. పర్యటన విరమించుకున్నారు. నిజానికి సోము వీర్రాజు ఏపీ చీఫ్ అయ్యాక.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అగ్రనేతలు ఎవరూ రావడం లేదు. ఎప్పుడో ఓ సారి నడ్డా వచ్చినా… చేయగలిగిందేమీ లేదు. దీంతో కేంద్ర రాజకీయాల కోసం తమను బలి చేస్తున్నారని ఏపీ బీజేపీ నేతలు గొణుక్కోవడం మినహా ఏమీ చేయలేకపోతున్నారు.