ఏపీ మంత్రుల పరిస్థితి రోజు రోజుకు దారుణంగా తయారవుతోంది. పేరుకు మంత్రులే కానీ వారి శాఖలేమిటో కూడా గుర్తు పెట్టుకోలేనంతగా పరిస్థితి మారిపోతోంది. మంత్రులు ఎవరికీ నేరుగా సమీక్షలు చేసే అధికారం లేదు. సమీక్షలు చేస్తానన్నా అధికారులు పట్టించుకోరు. వారు సమీక్షల్లో ఎప్పుడు పాల్గొంటారంటే.. సీఎం జగన్ ఎప్పుడైనా వారి శాఖలను సమీక్షిస్తే… ఆ సమీక్షల్లో పాల్గొంటారు. ఆ తర్వాత మీడియాకు వివరాలు చెబుతారు. ఇప్పుడు సీఎం జగన్ మంత్రులు అలాంటి సమావేశాలకూ దండగ అనుకుంటున్నారు.
బుధవారం గ్రామ, వార్డు సచివాలయాలపై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. కానీ పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధితో పాటు… పలు శాఖల మంత్రులు ఈ సమీక్షకు హాజరు కావాల్సి ఉంది. ప్రతీ సారి హాజరవుతారు. కానీ ఈ సారి ఏ ఒక్క మంత్రి హాజరు కాలేదు. అసలు అధికారులు సమీక్ష ఉందని సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు. ఇప్పటికే మంత్రులు పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయారు. నోరు ఉన్న మంత్రులు ప్రతిపక్షాల్ని తిట్టడానికి మిగతా మంత్రులు.. పార్టీ ఆఫీసు నుంచి మీడియాతో ఫలానా అంశంపై మాట్లాడాలని సమాచారం వచ్చినప్పుడే మాట్లాడుతున్నారు.
మంత్రులు సచివాలయానికి వస్తున్నదే తక్కువ. ఎక్కువగా నియోజకవర్గంలోనే గడప గడప కూ కార్యక్రమం పేరుతో తిరుగుతున్నారు. ఇక అధికార వ్యవహారాలను సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్న సజ్జల కనుసన్నల్లో జరుగుతూంటాయని.. ఉన్నతాధికారులుకూడా ఆయన మాటే వింటారని చెబుతున్నారు. మంత్రులుగా చేసినా కనీసం వారికి ఇవ్వాల్సిన గౌరవం.. ప్రోటోకాల్ కూడా ఇవ్వడం లేదు.