ఏపీ బీజేపీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. కన్నా లక్ష్మినారాయణ చేసిన విమర్శలపై ఎలా స్పందించాలో ఎవరికీ అర్థం కావడం లేదు. అదుకే ఎవరూ వినట్లే ఉండాలని సోము వీర్రాజు బ్యాచ్ కు స్పష్టమైన ఆదేశాలను పంపారు. అసలు కన్నా ఏం మాట్లాడారో తెలియనట్లుగా వ్యవహరించాలని సంకేతాలు పంపారు.దీంతో ఒక్కరు కూడా కన్నా టాపిక్ పై మాట్లాడటం లేదు. కన్నా గురించి హైకమాండ్‌కు సోము వీర్రాజు నివేదిక పంపినట్లుగా తెలుస్తోంది.
బీజేపి జిల్లా అధ్యక్షుల మార్పును తప్పుబట్టిన కన్నా… కోర్ కమిటీలో చర్చ జరగకుండానే జిల్లా అధ్యక్షులను మార్చారని ఫైర్ అయ్యారు. అధ్యక్షుల మార్పు తనతో చర్చించలేదని… ఇప్పుడు తొలగించిన వాళ్లంతా తాను నియమించిన వాళ్లేనని కన్నా వెల్లడించారు. కోర్ కమిటి సమావేశం తప్ప పార్టీలో ఇతర ఏ సమాచారం తమకు తెలియడం లేదని, రాష్ట్ర అధ్యక్షుడిగా తాను ఉన్నప్పడు ఎంతో మందిని బిజేపిలో జాయిన్ చేశానని గుర్తు చేశారు. ఇప్పడు వాళ్లంతా ఎందుకు పార్టీ వీడుతున్నారో వీర్రాజు సమాధానం చెప్పాలని కన్నా డిమాండ్ చేశారు.
తన వియ్యంకుడు బిఆర్ఎస్లో ఎందుకు చేరారో సోము వీర్రాజు ను అడగాలని కన్నా అన్నారు. ఎంపీ జివిఎల్ ఆలోచన స్థానిక బిజేపి కార్యకర్తల అభిప్రాయాలకు ఎప్పుడూ భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. అమరావతి రాజధాని సహా అనేక అంశాల్లో జీవిఎల్ వైఖరిని కన్నా ప్రస్తావించారు. జగన్- కేసిఆర్ కుట్రలో భాగంగానే బిఆర్ఎస్లోకి ఏపీ నేతలు వెళుతున్నారని కన్నా అభిప్రాయపడ్డారు. సోము వీర్రాజు దగ్గర బంధువులు కూడా బీఆర్ఎస్లో చేరడం కుట్ర అని కన్నా ఆరోపిస్తున్నారు. అందుకే… ఈ వ్యవహారలో ఆచితూచి వ్యవహరించాలనుకుంటున్నారు. ఎక్కువగా స్పందిస్తే… అది మీడిాయలో మరింత రచ్చ అవుతుందని అనుకుంటున్నారు.