ఏపీలో అడుగు పెట్టాలని అనుకుంటున్న భారత రాష్ట్ర సమితి ఓ అంశంపై క్లారిటీ ఇచ్చింది. ఏపీ రాజధానిగా అమరావతినే సమర్థిస్తామని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూల్లో క్లారిటీ ఇచ్చారు. రాజధాని అనేది రాజకీయ పార్టీల కోసం కాదని ప్రజల కోసమని.. గతంలో రాజధానిపై తీసుకున్న నిర్ణయాన్నే సమర్థిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో బీఆర్ఎస్ కూడా ప్రజాభిప్రాయానికి తగ్గట్లే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.
నిజానికి భారత రాష్ట్ర సమితికి అమరావతిని సమర్థించాలా లేదా అన్నదానిపై ఓ సందిగ్ధం ఉంది. గతంలో జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని కేటీఆర్ సమర్థించారు. అభివృద్ధి కారకంగా ఉంటుందన్నారు. అందుకే.. బీఆర్ఎస్ కూడా మూడు రాజధానుల విధానం తీసుకుంటుందన్న అభిప్రాయం ఏర్పడింది. కానీ తోట చంద్రశేఖర్ మాత్రం రాజధాని ప్రజల కోసం అని.. అమరావతికే మద్దతు అని చెప్పడంతో ఏపీ విషయంలో బీఆర్ఎస్ మొదట అనుమానం కాస్త క్లారిటీగా తీర్చినట్లయింది.
అయితే బీఆర్ఎస్ విధివిధానాల్ని ఖరారు చేసేది తోట చంద్రశేఖర్ కాదు. కేసీఆర్ మనసులో ఏముందో తేలాల్సి ఉంది. ఆయనే తోట చంద్రశేఖర్ కు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చి ఉంటే.. ఎలాంటి సమస్యా ఉండదు. కానీ.. తర్వాత మూడు రాజధానులకు మద్దతు అంటే మాత్రం.. సీన్ మారిపోతుంది. ఏపీలో బీఆర్ఎస్కు ఇదొక్కటే సవాల్ కాదు.. ఇంకా చాలా ఉన్నాయి.