ఎన్నికలకు సమాయత్తం కావడానికి తెలంగాణ బీజేపీని సంస్కరించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. బండి సంజయ్ ను మార్చి…. ఈటల రాజేందర్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. బండి సంజయ్ కు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి తర్వాత కేంద్రమంత్రి వర్గ విస్తరణ జరపనున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేసుకుని ఈ మంత్రివర్గ విస్తరణ చేపడుతున్నందున… తెలంగాణ నుంచి మరొకరికి మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు.
ప్రస్తుతం తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. మరో ముగ్గురు లోక్ సభ ఎంపీలు ఉన్నారు. ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, బండి సంజయ్ ఎంపీలుగా ఉన్నారు. వీరిలో బండి సంజయ్ వైపే బీజేపీ పెద్దలు మొగ్గు చూపుతున్నారు. మరో సీనియర్ నేత లక్ష్మణ్‌కు ఇటీవల యూపీ నుంచి ఎంపీగా అవకాశం కల్పించారు. అయితే ఆయన ప్రస్తుతం ఎన్నికల కమిటీలో కూడా కీలకంగా ఉన్నారు. పార్టీ బాధ్యతల్లో ఉన్నందున ఆయనను కేంద్రమంత్రిని చేయకపోవచ్చని అంటున్నారు.
తెలంగాణ బీజేపీని బండి సంజయ్ దూకుడుగా నడిపారు. అయితే ఆయన వల్ల బీజేపీలో గ్రూపులు ఏర్పడ్డాయి. వ్యక్తిగత ప్రాబల్యం కోసం ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై హైకమాండ్ కు చాలా ఫిర్యాదులు వెళ్లాయి. అదే సమయంలో కేసీఆర్ కు ప్రత్యర్థిగా ఈటల రాజేందర్ అయితేనే కరెక్ట్ అన్న అభిప్రాయానికి హైకమాండ్ వచ్చినట్లుగా చెబుతున్నారు. సంక్రాంతి తర్వాత ఈ విషయంలో కీలక మార్పులు ఉండే అవకాశం ఉంది.