శ్రీకాకుళంలో జనసేన పార్టీ నిర్వహించబోతున్న యువశక్తి కార్యక్రమానికి పోలీసుల నుంచి ఇంత వరకూ అనుమతి రాలేదు. బాధ్యత గల ప్రతిపక్షం గా జనసేన చేస్తున్న కార్యక్రమాల్ని కూడా ప్రభుత్వం దుర్మార్గం గా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని.. నాదెంండ్ల మనోహర్ ఆరోపిస్తున్నారు. డీజీపీ కి ఇప్పటికే యువ శక్తి కార్యక్రమం గురించి తెలియజేశామని కానీ స్పందన లేదంటున్నారు.
జనవరి 12 న శ్రీకాకుళం జిల్లా లో రణస్థలం వద్ద నిర్వహించే యువశక్తి కార్యక్రమంలో వంద మందికిపైగా యువతకు మాట్లాడే అవకాశం ఇస్తామని జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. .. రాష్ట్రవ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున తరలివస్తామంటున్నారని చెబుతున్నారు. 175 కు 175 గెలుస్తామన్న సీయం జగన్ ప్రతిపక్షాల సభలను భయంతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో పెన్షన్ లు తొలగించారని ఎప్పుడైతే ఆందోళన మొదలైందో డైవర్షన్ కోసం ..ప్రతిపక్ష సభల రద్దు కోసం జీవో తెచ్చారన్నారు
ఇటీవల ఏపీలో జీవో నెంబర్ 1 దుమారం రేగుతోంది. సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలంటే ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే పోలీసులు కేసులు పెడతారు. కుప్పం చంద్రబాబు పర్యటనలో అదే జరిగింది. ఇప్పుడు జనసేన పార్టీ రణస్థలంలో యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. నిజానికి ఇవన్నీ జీవో నెంబర్ 1 తీసుకు రావడానికన్నా ముందే ఖరారయ్యాయి. అయితే జీవో వచ్చాక.. పరిస్థితులు మారిపోయాయి. ఓ వైపు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడిక్కడ రోడ్ షోలు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కానీ ప్రతిపక్ష నేతలకు మాత్రం పక్కాగా నిబంధనలు పెడుతున్నారు. దీంతో దుమారం రేగుతోంది. యువశక్తి సభపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.