ఏపీలో మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు తీసుకోరో ఎవరికీ తెలియదు. కానీ విపక్ష పార్టీలు మాత్రం తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉంటాయి. పెద్ద ఎత్తున హవాలా నగదు ఆ వ్యాపారం ద్వారా వస్తుందని.. మొత్తం అన్ని స్థాయిలో వైసీపీ నేతల ప్రమేయం ఉందని.. కొన్నివేల కట్లు అలా తరలి పోతోందని ఆరోపిస్తూ ఉంటారు. అయితే ఎలాంటి విచారణ జరగలేదు.. లింకులు బయటకు రాలేదు. ఢిల్లీలో బయటపడిన లిక్కర్ స్కాం వ్యవహారంలోనూ ఈ నగదు లావాదేవీల అంశం కీలకంగా మారింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తాజాగా ఈడీ దాఖలు చేసిన చార్జిషీటు లో ఈ వివరాలు చెప్పారు. శరత్ చంద్రారెడ్డికి చెందిన కంపెనీలకు ఢిల్లీలో కొన్ని జోన్లలో లిక్కర్ వ్యాపారం దక్కింది. ఈ లిక్కర్ వ్యాపారం కోసం తెరిచిన దుకాణాల్లో కేవలం నగదు లావాదేవీలు మాత్రమే జరిగాయట. ఆన్ లైన్ చెల్లింపులు అంగీకరించలేదని.. . ఇలా రోజు వచ్చే నగదును ఓ రహస్య ప్రాంతానికి తరలించారని చార్జిషీటులో ఈడీ చెబుతోంది. లిక్కర్ స్కాం కేసులో శరత్ చంద్రారెడ్డే కింగ్ పిన్ అని చెబుతున్నారు
కల్వకుంట్ల కవిత తరపున బినామీగా అరుణ్ రామచంద్ర పిళ్లై వ్యవహరిస్తున్నారని ఈడీ చెబుతోంది. దీనికి సంబంధించిన పలు వివరాలను చార్జిషీటులో పొందుపరిచారు. కవిత నివాసంలో నిందితులు పలుమార్లు భేటీ అయ్యారని ఈడీ చెబుతోంది. శరత్ రెడ్డి భార్యకు చెందిన విమానాల్లో తిరిగారని అంటున్నారు. శరత్ రెడ్డి … విజయసాయిరెడ్డి అల్లుడికి అన్న. ఈడీ చార్జిషీటు క్లియర్ గా ఉండటంతో.. ముందు ముందు ఈ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.