ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రతీ వారం రాసే కొత్త పలుకులో ఈ వారం జగన్పై డైరక్ట్ ఎటాక్ చేశారు. ప్రతీ వారం ఆయన చేస్తున్నది ఇదే అయినా ఈ సారి మాత్రం కాస్త భిన్నత్వం కనిపించింది. పూర్తిగా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వాదననే తన వాదనగా వినిపించారు. విశ్లేషించారు. కొత్తగా ఎలాంటి విషయాలూ చెప్పలే్కపోయారు. జగన్ మోహన్ రెడ్డి భయం భయంగా బతుకుతున్నారని ఆయన తేల్చేశారు. దానికి సాక్ష్యంగా ఆయన తీసుకొచ్చిన జీవో నెంబర్ వన్ ఆధారంగా చంద్రబాబును కట్టడి చేయాలనుకోవడం… తమ పార్టీ నేతలు మాత్రం విచ్చల విడిగా రోడ్ షోలు నిర్వహించడం చూపించారు.
ఆర్కే చెప్పే విషయాల్లో లాజిక్లు పెద్దగా వెదకాల్సిన పని లేదు. ఎక్కువ సార్లు నిజమే కదా అనిపించేలా ఉంటాయి. ఈ సారి కూడా ఆర్కే జగన్ మోహన్ రెడ్డి భయంతో బతుకుతున్నాడని చెప్పడానికి అనేక ఉదాహరణలు చెప్పారు. చంద్రబాబు సభలకు జనం రావడం లేదని ఇరుకు సందుల్లో సభలు పెడుతున్నారని వైసీపీ నేతల ఆరోపణ. అందుకే జీవో తెచ్చామని ప్రభుత్వం చెబుతోంది. అంతగా జనం రానప్పుడు… ఆ వచ్చే కొద్ది మంది కోసం… పోలీసు భద్రత కల్పిస్తే సరిపోతుందిగా ఎందుకు భయపడటం అనేది ఆర్కే ప్రశ్న. అది నిజమే కదా అని అనిపిస్తుంది. టీడీపీ నేతలు కూడా ఇదే చెబుతున్నారు. అడ్డుకోవడానికి వందల మందిని మోహరిస్తున్నారు.. భద్రత కోసం కొంత మందిని కేటాయిస్తే సరిపోతుంది కదా అని వారి వాదన.
అయితే ప్రభుత్వ ఆలోచన ఏందో వారికి తెలియకుండా ఉంటుందని అనుకోలేరు కదా. అలాగే ప్రతిపక్ష నేతల్ని ప్రజల్లో తిరగకుండా చేసి.. తాము మాత్రమే తిరిగితే ప్రజలు ఓట్లేస్తారా అని ఆర్కే ప్రశ్నించారు. అదే సమయంలో ఆర్కే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం, క్రిమినల్ మైండ్ సెట్ గురించి కూడా విశ్లేషించారు. ఆయన తీరును చూస్తే… కందుకూరు, గుంటూరు ఘటనల్లో కుట్ర లేదని అనుకోలేమని ఆయనంటున్నారు. చాలా మంది టీడీపీ నేతలు కూడా ఇదే సందేహం వ్యక్తం చేశారు. ఓ వైపు చంద్రబాబు జనాల్లోకి వెళ్తూంటే.. లోకేష్, పవన్ యాత్రలు ప్రారంభించడానికి ముందే ప్లాన్డ్ గా జరిగినట్లుగా జరిగిపోవడంం.. జీవో రావడం .. అన్నీ స్క్రిప్ట్ ప్రకారమే జరిగినట్లున్నాని టీడీపీ నేతలు చెబుతున్నారు.
ఈ విషయంలో ఆర్కేకూ టీడీపీకి మధ్య భావసారూప్యత కనిపించింది. తెలుగుదేశం పార్టీ అభిప్రాయమే ఈ వారం ఆర్కే పలుకులో ఎక్కువగా వినిపించింది. సొంతంగా ఆర్కే ప్రత్యేకమైన కోణంలో ఎలాంటి విశ్లేషణ చేయలేదు. తొక్కిసలాట ఘటనలు జరిగినప్పటి నుండి టీడీపీ చెబుతున్నదే చెప్పారు. కొత్తగా ఏమీ ఈ వారం ఆర్కే చెప్పలేకపోయారు.