జీవోను చదువుకున్నారా.. మేం రోడ్ షో, ర్యాలీలు నిషేధించలేదు అంటూ.. మంత్రులు ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకు వచ్చి హడావుడిగా ప్రకటనలు చేస్తున్నారు. సకల శాఖా మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే చెబుతున్నారు. హఠాత్తుగా వీరిలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో కానీ… అలా లేనప్పుడు కుప్పంలో చంద్రబాబు పర్యటనను ఎందుకు అడ్డుకున్నారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారుతోంది. ఈ జీవో వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. చట్ట విరుద్దం అని న్యాయనిపుణులు ఇప్పటికే తేల్చారు. దీంతో ముందు జాగ్రత్తగా రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించలేదన్న వాదనను వినిపిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
జీవోను సాకుగా చూపించి కుప్పంలో చంద్రబాబు పర్యటనపై తీవ్ర స్థాయిలో ఆంక్షలు విధించారు. చంద్రబాబు పర్యటనకు ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. రెండు వేల మంది కార్యకర్తలు వచ్చే చోట.. రెండున్నర వేల మంది పోలీసుల్ని మోహరించి అడ్డుకున్నారు. కుప్పం మొత్తం బారీ కేడ్లు పెట్టారు. మూడు రోజుల పాటు అదే పరిస్థితి. మరి ఎందుకు అడ్డుకున్నారన్నది పోలీసులు చెప్పగలరా? పోలీసులు తనను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని చంద్రబాబు కోరినా జీవో కాపీ ఇచ్చారు కానీ.. అసలు కారణాలు చెప్పలేదు. దీనిపై టీడీపీ న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకుంది.
ప్రభుత్వం జారీ చేసిన జీవో చట్ట బద్ధం కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని అడాప్ట్ చేసుకోలేదు. ఒక వేళ ఆ చట్టం ప్రకారం విధించే పోలీస్ యాక్ట్ 30 ప్రకారం కూడా.. రాజకీయ నేతలు సభలు, సమావేశాల దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు కోరాలనే ఉంటుంది. అయితే చట్టానికి ఇష్టం వచ్చినట్లుగా అన్వయం చేసుకుని పోలీసులతో పొలిటికల్ గేమ్ ఆడుతున్న ప్రభుత్వం హఠాత్తుగా మాట మార్చేసింది. రోడ్ షోలు, ర్యాలీలు నిషేధించలేదని అంటోంది.
ఈ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందన్న తీవ్ర ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఈ జీవో జారీ.. వెంటనే కుప్పంలో చంద్రబాబును అడ్డుకున్న వైనం అంశం న్యాయస్థానంలో ఇదే అంశాన్ని తేటతెల్లం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే మంత్రులు హడావుడిగా ప్రెస్ మీట్లు పెట్టి.. జీవోలో రోడ్ షోలు, ర్యాలీలు నిషేధించలేదని ఉందని అంటున్నారు. అందులో లేకపోతే ఎందుకు టీడీపీ నేతల కార్యక్రమాల్ని అడ్డుకున్నారన్నది ఇప్పుడు తేలాల్సిన అంశం. కోర్టులో.. ప్రజాకోర్టులోనూ దీనిపై వాదనలు జరుగుతాయి.