జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనూహ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లారు. కుప్పంలో మూాడు రోజుల పర్యటన తర్వాత చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. కుప్పంలో ఆయన పర్యటనలో పోలీసులు తీవ్రమైన నిర్బంధాలు పెట్టారు. ఈ అంశంపై మాట్లాడటానికి .. ప్రభుత్వం జారీ చేసిన జీవో విషయంలో ఉమ్మడిగా పోరాట కార్యాచరణ రూపొందించడానికి వీరిద్దరూ కలిసినట్లుగా చెబుతున్నారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ అంశం చివరి వరకూ గోప్యంగానే ఉంది. పవన్ కల్యాణ్ ఇంటి నుంచి బయలుదేరే సమయంలోనే బయటకు తెలిసింది. ఈ భేటీలో లోకేష్ పాల్గొనలేదు. చంద్రబాబు మాత్రమే పాల్గొన్నారు. అయితే వీరి మధ్య పొత్తు చర్చలు కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రెండు పార్టీల మధ్య ఓ అవగాహన కుదిరిందని.. నియోజకవర్గాలు కూడా ఫైనల్ చేసుకున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు, పవన్ మధ్య చర్చలు.. కీలకంగా మారాయి.
సహజంగానే చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ సంచలనం సృష్టించింది. వైసీపీ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. భేటీ జరుగుతున్న విషయం తెలిసిన వెంటనే.. అంబటి రాంబాబు అభ్యంతరకర తీరిలో ట్వీట్ చేశారు. మిగిలిన నేతలూ అలాగే స్పందిస్తున్నారు.