వాల్తేరు వీరయ్య గురించి దర్శకుడు బాబీ ఎప్పుడు మాట్లాడినా.. కాన్ఫిడెన్స్‌తోనే మాట్లాడుతున్నాడు. ‘మీరు ఎన్ని అంచనాలైనా పెట్టుకొని సినిమాకి రండి.. దాన్ని నిలబెట్టుకొంటా’ అని ప్రామిస్ చేస్తున్నాడు. విశాఖలో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనూ ఇదే డైలాగ్ రిపీట్ చేశాడు. ”నేను ఇప్పటికి నాలుగు సినిమాలు చేశాను. వాటి రిలజ్ట్ బాగానే ఉన్నా.. హిట్ అనే సౌండింగ్ సరిగా వినపడలేదు. ఈసారి మాత్రం రీసౌండ్ రాబోతోంది. ఇంట్రవెల్ బ్యాంగ్ పది నిమిషాలూ అరాచకమే. వాల్తేరు వీరయ్య వరల్డ్ లోకి అభిమానుల్ని తీసుకెళ్లబోతున్నాం. ఈసారి ఇంట్రవెల్ అనే కార్డు వేయడం లేదు. పూనకాలు లోడింగ్ అనే కార్డు వేస్తున్నాం. ఆ ట్యాగ్ లైన్ మేం ఊరికే వాడలేదు.. పూనకాలు వచ్చేలానే సినిమా తీశాం” అని ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్టవుతుందని బల్ల గుద్ది మరీ చెప్పేశాడు బాబి. మాటల ప్రస్తావనలో పవన్ కల్యాణ్ అంశం వచ్చింది.
”అన్నయ్యా.. మీరు రాజకీయాలు వద్దు… మీకు సరిపడవు.. దానికోసం పవర్ స్టార్ ఉన్నాడు. మాటకు మాట, కత్తికి కత్తి సమాధానం చెప్పగలడు.. మీ మంచితనమే పవర్ స్టార్‌లోనూ ఉంది..” అంటూ ఓసారి పవన్ కల్యాణ్ ని గుర్తు చేసుకొన్నాడు. బాబి మాత్రమే కాదు.. ఆయన నాన్నగారు కూడా చిరంజీవి అభిమానే. అయితే ఇటీవలే ఆయన చనిపోయారు. తండ్రి మరణాన్ని తలచుకొంటూ.. బాబి ఎమోషనల్ అయ్యాడు. ”నాన్నకి ఒంట్లో బాగోలేదు. ఆయన చనిపోతారని ముందే తెలుసు. కానీ ఆయన మాత్రం ‘నువ్వు ఇక్కడుంటే షూటింగ్ ఎలా జరుగుద్ది’ అని నన్ను సెట్ కి పంపేవారు. ఆయన చనిపోయిన మూడు రోజుల తరవాత.. నేను ‘వాల్తేరు..’ సెట్ కి వెళ్లిపోయా. మా నాన్న నన్ను వెనకుండి నడిపించినట్టు అనిపించింది” అని భావోద్వేగానికి లోనయ్యాడు బాబి.