యూ టర్న్ అంటే ఒక్కటే ఉంటుంది.
అదేంటో వారసుడు విషయంలో దిల్ రాజు తీసుకొన్న యూ టర్న్‌లకు అంతూ పంతూ ఉండడం లేదు.
కాసేపు ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లొద్దాం.
2019లో సంక్రాంతిన.. తెలుగులో సినిమాల జోరు ఎక్కువగా ఉన్నప్పుడు తమిళం నుంచి ఓ బడా స్టార్ డబ్బింగ్ బొమ్మ వచ్చింది. దాన్ని చూసి దిల్ రాజుకు షివరింగ్ వచ్చింది. `హాఠ్. సంక్రాంతి మన పండగ.. మన పండక్కి… తెలుగు సినిమాలు ఉండాలి కానీ.. తమిళ సినిమాలేంటి..?` అన్నాడు.
ఆయన భాషాభిమానం.. ప్రాంతీయాభిమానం, టోటల్ గా తెలుగు సినిమాపై ఉన్న అభిమానం.. ఇవన్నీ చూసి `యస్స్….` అన్నారంతా. మరో మాట లేదు. తెలుగులో తెలుగు పండగలు వచ్చినప్పుడు తెలుగు సినిమాకే అగ్ర తాంబూలం ఇవ్వాలి. కాబట్టి.. దిల్ రాజు మాట చెల్లుబాటు అయ్యింది.
అయితే ఇప్పుడు.. ఇదే తెలుగు పండగ రోజున.. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు రిలీజ్ అవుతున్న వేళ… దిల్ రాజు బ్యానర్ నుంచి ఓ డబ్బింగ్ సినిమా వస్తోంది. అదే వారసుడు. తెలుగు హీరోల సినిమాలు కాదని.. ఓ డబ్బింగ్ సినిమాకి తన దగ్గరున్న థియేటర్లన్నీ కట్టబెట్టాడు దిల్ రాజు. అదేంటి సార్.. అంటే.. `డబ్బింగ్, స్ట్రయిట్ సినిమాలంటూ తేడా ఏముంటుంది? ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ నడుస్తోంది. మాకు బాషా బేధాల్లేవు` అన్నారు. ఇది యూ టర్న్ నెంబర్ 1 అయ్యింది.
ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో… అజిత్ – విజయ్ సినిమాల్ని, వాళ్ల స్టార్ డమ్ లనూ పోల్చి మరోసారి దొరికిపోయాడు. అజిత్ కంటే.. విజయ్ స్టార్ డమ్ ఎక్కువని, అలాంటప్పుడు తమిళ నాట అజిత్ కీ విజయ్ కీ థియేటర్లు సమానంగా పంచడం ఏమిటని? అద్భుతమైన లాజిక్ పట్టుకొన్నాడు. ఇదే లాజిక్ ని కెలికి… మళ్లీ దిల్ రాజుని కార్నర్ చేశారు చిరు, బాలయ్య ఫ్యాన్స్. హీరో స్థాయికీ, మార్కెట్ కీ తగినట్టుగా థియేటర్లు కేటాయించాలి అన్నపుడు.. తెలుగు విజయ్ స్థాయేంటి? చిరు, బాలయ్యల స్థాయేంటి? వాళ్లకంటే.. విజమ్ సినిమాకి థియేటర్లు ఎందుకు కేటాయించాల్సివచ్చింది? అంటూ సోషల్ మీడియా సాక్షిగా దిల్ రాజుపై ప్రశ్నల వర్షం కురిపించారు. అక్కడ ఇంకోసారి దొరికిపోయిన దిల్ రాజు మళ్లీ యూ టర్న్ తీసుకోవాల్సివచ్చింది. `నా సినిమాని.. నా థియేటర్లు ఇచ్చుకొంటే తప్పేంటి` అంటూ.. ఆయనలోని బాషాభిమానినీ, ప్రాంతీయాభిమానినీ, తెలుగు సినిమా అభిమానినీ పక్కన పెట్టి అసలు సిసలైన నిర్మాతని బయటకు లాక్కుని రావాల్సివచ్చింది.
13న బాలయ్య సినిమాకి పోటీగా.. వారసుడు రావాలి. అప్పుడు బాలయ్యతో థియేటర్లు పంచుకోవాలి. అది ఇష్టం లేక.. ఒక రోజు ముందేస్తే అన్ని థియేటర్లలోనూ తన సినిమా వేసుకోవొచ్చన్న తెలివితేటలతో.. 11న సినిమా విడుదలంటూ ప్రకటించాడు. ఇది యూ టర్న్ నెంబర్ 4.
ఇప్పుడు మరో టర్న్.. సినిమా రిలీజ్ ని 11 నుంచి 14కి వాయిదా వేశాడు. ఎందుకండీ రాజుగారూ ఈ నిర్ణయం? అంటూ ఆయన్ని అడిగితే…`తెలుగులో ముందు చిరంజీవి, బాలయ్య సినిమాలకే ప్రాధాన్యత. నా సినిమా వల్ల వాళ్లకు ఒక్క శాతం కూడా నష్టం జరక్కూడదు. వాళ్లకు కావల్సినన్ని థియేటర్లు ఇచ్చాకే…నా సినిమాని విడుదల చేస్తా` అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఓ నిర్మాత ఓ సినిమా విషయంలో ఇన్ని యూ టర్న్‌లు తీసుకోవడం నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనుకోవాలి. కనీసం ఇప్పుడైనా చిరు, బాలయ్యలు గుర్తొచ్చారు. రాజుగారికి. సంతోషం. వారిద్దరికీ పోటీగా ఓ తమిళ హీరో సినిమాని విడుదల చేస్తే ఏమవుతుందో దిల్ రాజు ఆలస్యంగానైనా ఊహించి ఉంటారు. అందుకే ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
కాకపోతే.. 11న తమిళ వెర్షన్ వచ్చేస్తుంది. తెలుగు సినిమా చూడాలంటే మూడు రోజులు ఆగాలి. సినిమా బాగుంటే ఓకే. కాస్త యావరేజ్ గా ఉంది.. అటూ ఇటుగా ఉంది.. శ్రీమంతుడులానో, మహర్షిలానో ఉంది అనే టాక్ వస్తే మాత్రం ఆ ప్రభావం తెలుగు వసూళ్లపై పడుతుంది. ఇక్కడ వారసుడు సినిమాని ఫ్రీగా చూపిస్తామన్నా పట్టించుకొనే నాథుడు ఉండడు. ఇంత రిస్క్ ఉన్నా సరే.. తన సినిమాపై నమ్మకంతో ఇంత డేరింగ్ స్టెప్ తీసుకొన్న దిల్ రాజుని ఈ విషయంలో అభినందించాల్సిందే. ఈలోగా.. మరో యూ టర్న్ తీసుకోకపోతే.