గుణశేఖర్ సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో కూడుకున్నవే. సినిమాలో హీరో ఎవరైనా సరే, కథకు తగ్గట్టుగానే ఖర్చు పెట్టిస్తారు. ఆయన సినిమా అనగానే భారీ సెట్లు గుర్తొస్తుంటాయ్. అవి కూడా బడ్జెట్ ని పెంచుకుంటూ వెళ్తాయి. `శాకుంతలమ్` చిత్రానికీ అలానే కోట్లు ధారబోశార్ట. `లేడీ ఓరియొంటెడ్ చిత్రాల్లో ఇండియాలోనే ఖరీదైన చిత్రం ఇదే`నని గుణశేఖర్ ప్రకటించారు. శాకుంతలమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్… ఈరోజు హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా శాకుంతలమ్ గురించి ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
“ఇండియన్ మైథాలజీ చిత్రాల్లో ఓ ప్రామాణికంగా ఉండాలని `శాకుంతలమ్` తీశాం. ఓ యేడాది పాటు ప్రీ ప్రొడక్షన్‌కి కేటాయించాం. ఆరు నెలల్లో షూటింగ్ ముగిసింది. మరో యేడాదిన్నర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు కేటాయించాం. ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాం. కథానాయికగా ఎంతోమందిని అనుకొన్నా. కానీ మా అమ్మాయి నీలిమ గుణ.. సమంత అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలదు అని చెప్పింది. నిజంగానే ఈ సినిమాలో శాకుంతలగా సమంత తన పాత్రకు న్యాయం చేసింద“న్నారు. వేదికపై మాట్లాడుతున్నప్పుడు గుణశేఖర్ తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యారు. గుణ శేఖర్ కళ్లల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. గుణశేఖర్‌ని చూసి సమంత కూడా ఎమోషన్ ఆపుకోలేకపోయింది. ఈ సినిమా ప్రమోషన్ కోసమే చాలాకాలం తరవాత సమంత మీడియా ముందుకు వచ్చింది.