కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డును విశాఖలో పెట్టాలని సీఎం జగన్ నిర్ణయించడం రాయలసీమలో కొత్త సెంటిమెంట్‌కు కారణం అవుతోంది. అసలు విశాఖకు కృష్ణా నదికి ఏం సంబంధం అని.. కర్నూలులో కేఆర్ఎంబీని పెట్టాలనే డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఈ అంశంపై కొత్తగా పోరాటం ప్రారంభించారు. కేఆర్ఎంబీ చైర్మన్ ను కలిసి కృష్ణా బోర్డును పరివాహక ప్రాంతంలోనే పెట్టాలని.. వైజగ్లో పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు.
నిజానికి హైదరాబాద్‌లో ఉన్న కృష్ణా రివర్ మేనేజె మెంట్ బోర్జును విజయవాడలో పెట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇక విజయవాడకు తరలించడమే తరువాయి అని అనుకున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన కేఆర్ఎంబీ మీటింగుల్లోనూ మార్పు గురించి మాట్లాడలేదు. అయితే ఎప్పుడు మూడు రాజధానుల పాట అందుకున్నారో ఆ తర్వాత కృష్ణాబోర్డును విశాఖకు తరలించాలని అనుకున్నారు. అసలు విశాఖకు కృష్ణానదికి సంబంధం ఏమిటని.. విజయవాడలో పెట్టడం ఇష్టం లేకపోతే కర్నూలులో పెట్టవచ్చు కదా అని వస్తున్న సూచనలను ప్రభుత్వం అంగీకరించలేదు.
విభజన చట్టం ప్రకారం గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు హైదరాబాద్‌లో… కృష్ణాబోర్డు ఏపీలో ఉండాలని నిర్ణయించారు. అయితే గోదావరి లేకపోయినా హైదరాబాద్ జీఆర్ఎంబీని పెట్టారు కాబట్టి.. తాము విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా భావిస్తున్నందున .. తాము కేఆర్ఎంబీని అక్కడే పెడతామని మొండి పట్టుదలకు పోతున్నారు. ఈ వ్యవహారం రాయలసీమలో చర్చనీయాంశం అవుతోంది. అవకాశం ఉన్న చోట న్యాయం చేయకుండా.. అవకాశం లేనివి ప్రకటనలు చేసి.. వివాదాల్లోకి నెట్టి అసలు పనులు జరగకుండా చేస్తున్నారని మండి పడుతున్నారు. వైసీపీని సమర్థించే పురుషోత్తమరెడ్డి అనే మేధావి కూడా… జగన్ ప్రభుత్వాన్ని ఈ విషయంలో విమర్శిస్తున్నారు.