బీఆర్ఎస్ నుంచి కొంత మంది సీనియర్ నేతలు గుడ్ బై చెప్పడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే కొంత మందిని కేసీఆరే పంపేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపలో చేరడానికి సిద్ధమయ్యారు. దీంతో ఖమ్మం నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి తుమ్మల నాగేశ్వరరావును ఆహ్వానించలేదు. ఆహ్వానించినా సరే ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. పొంగులేటితో ఎవరూ వెళ్లకుండా చూడటంతో పాటు బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అయితే తుమ్మలను కేసీఆర్ ఆహ్వానించకపోవడంతో ఆయన కూడా బీజేపీోల చేరిపోతారని లైట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
తుమ్మల నాగేశ్వరరావు చాలా కాలంగా ఖమ్మం బీఆర్ఎస్ లో యాక్టివ్ గా లేరు. యాక్టివ్ గా లేరు అనడం కంటే.. ఆయనను పిలవడం లేదని చెప్పుకోవచ్చు. అయితే తనను విస్మరించినా తాను మాత్రం రాజకీయాలకు దూరం కాబోనని తుమ్మల చెబుతున్నారు. టీఆర్ఎస్ లో ఉండగా పాలేరు నుంచి పోటీ చేసి గెలిచారు. అదే నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు. నిజానికి తుమ్మల టీడీపీలో ఉండగా ఖమ్మం సిటీ నుంచి పోటీ చేసేవారు. పాలేరు రెడ్డి సామాజికవర్గం వారికి బలమైన సీటుగా పేరుంది. అయినా సరే తాను ఎంతో అభివృద్ధి చేశానని..తనకు ప్రజల మద్దతు ఉందని అక్కడే పోటీ చేస్తానని అంటున్నారు.
అయితే ప్రస్తుత ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు టిక్కెట్ హామీ ఇచ్చారు కేసీఆర్. అదే సమయంలో ఖమ్మంలో కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుంది. ఈ కారణంగా తుమ్మలకు సీటు సర్దుబాటు చేయడం సాధ్యం కాదు. కానీ ఆప్షన్స్ మాత్రం చాలా ఉన్నాయి. అందుకే తుమ్మలను ఎంత బుజ్జగించినా ఆగరని.. ఆయనను పట్టించుకోకపోవడమే మంచిదని కేసీఆర్ అనుకుంటున్నట్లుగా కనిపిస్తోందని బీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.