షారుఖ్ ఖాన్ బాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్ ఖాన్. అయితే ఇది గతం. ఇప్పుడు ఆయనకు సరైన విజయాలు లేవు. ఆయన నటించిన వరుస సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొడుతున్నాయి. ఇప్పుడు ఆయన ఆశలన్నీ ‘పఠాన్’ సినిమాపైనే వున్నాయి. మంచో చెడో ‘బేషరమ్ రంగ్’ పాటతో ఈ సినిమా దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ గురించి ఒక్క మాటలలో చెప్పాలంటే.. ఇదొక హాలీవుడ్ ‘మిషన్ ఇంపాజిబుల్’ తరహా సినిమా. ఇలాంటి సినిమాలకి ఒక రొటీన్ టెంప్లెట్ వుంటుంది. దేశానికి ఒక ఆపద వస్తుంది. గూఢచారి కథానాయకుడు ఆ ఆపద నుండి దేశాన్ని కాపాడుతాడు. పఠాన్’ కథ కూడా ఇదే.
‘ఔట్ ఫిక్స్’ అనే ప్రైవేట్ టెర్రరిజం గ్రూపు. డబ్బు కోసం కోసం ఎలాంటి దుర్మార్గాపు పని చేసే గ్రూపు ఇది. దీనికి నాయకుడు జాన్ అబ్రహం. ఈ గ్రుపు భారత్‌లోని కొన్ని నగరాలపై మిస్సైల్స్‌తో గురి పెడుతుంది. దిన్ని తిప్పికొట్టడానికి అజ్ఞాతంలో ఉన్న ‘పఠాన్ అనే రా ఏజెంట్‌ను భారత ప్రభుత్వం నియమిస్తోంది. టెర్రిరిస్ట్ గ్రూపును హీరో ఎలా అంతం చేసాడనేదే మిగతా కథ. ఇలాంటి కథల సక్సెస్ థియేటర్ అనుభూతిని ఇచ్చే ఎలిమెంట్స్ పై వుంటుంది. ‘పఠాన్’ లో అలాంటి ఎలిమెంట్స్ బాగానే వున్నాయి. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుందీ ట్రైలర్. ఒళ్లు గగుర్పాటు పొడిచే పోరాట సన్నివేశాలు కూడా ట్రైలర్ లో కనిపించాయి.
బాలీవుడ్ పరిశ్రమ ప్రస్తుతం సౌత్ పై ద్రుష్టి పెట్టింది. సినిమాలో కంటెంట్ వుంటే సౌత్ ఆడియన్స్ ఎంత ఆదరిస్తారో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, కాంతారా చిత్రాలు నిరూపించాయి. బాలీవుడ్ నుండి కూడా ఒక సినిమా ఇక్కడ భారీ హిట్టుకొట్టడం ఆ పరిశ్రమకు ఆవశ్యకం. పఠాన్ ని పాన్ ఇండియా ద్రుష్టిలో పెట్టుకొని తీశారు. ట్రైలర్ చూస్తుంటే యాక్షన్ ని ఇష్టపడే అందరికీ పఠాన్ నచ్చే ఛాన్స్ వుంది. ఇక్కడ కూడా మంచి ప్రోమోషన్స్ చేసి విడుదల చేయాలని పఠాన్ టీం ప్లాన్. ఇక్కడ విడుదల చేసిన బ్రహ్మాస్త్ర కి ఆదరణ బాగానే వచ్చింది. పఠాన్ ట్రైలర్ కూడా ప్రామెసింగా వుంది. సరిగ్గా ప్లాన్ చేసుకొని విడుదల చేస్తే తెలుగు ప్రేక్షకుల ఆదరణని పొందే అవకాశాలు వున్నాయి.