తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయాల్లో యాక్టివ్ కావాలని నందమూరి తారకరత్న గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సినిమాల్లో సక్సెస్ కాలేకపోయిన ఆయన.. తాత పెట్టిన టీడీపీలో అయినా అదృష్టాన్ని పరీక్షించుకోవానుకుంటున్నారు. ఇటీవల గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు కొన్ని కార్యక్రమాలకు ఆహ్వానించడంతో వెళ్లి వచ్చారు. ఈ సందర్భంగా తాను ఎన్నికల్లో పోటీకి సిద్దమని ప్రకటించారు. అయితే టీడీపీ నేతలు సీరియస్గా తీసుకోలేదు. కానీ తారకరత్న ఈ విషయంలో సీరియస్గా ఉన్నారని తాజాగా లోకేష్ కలవడంతో స్పష్టమయింది.
ప్రస్తుతం ఏపీలో తారకరత్నకు ఏదైనా నియోజకవర్గం నుంచి టీడీపీ టిక్కెట్ కేటాయించడం కొంచెం కష్టమైన వ్యవహారమే. ప్రతీ నియోజకవర్గంలో బలమైన పోటీ దారులు ఉన్నారు. అంతగా కష్టపడని ఇంచార్జులు ఉన్న చోట.. తారకరత్నను సర్దుబాటు చేయడం కష్టమే. ఎందుకంటే ఆయన పూర్తిగా నియోజకవర్గానికి కొత్త అవుతారు. అయితే కుటుంబం నుంచి సంపూర్ణ మద్దతు కోసం చంద్రబాబు తారకరత్నకు టిక్కెట్ సర్దుబాటు చేయవచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే అది తెలంగాణలోనా ఏపీలోనా అన్నది తేలాల్సి ఉంది.
తారకరత్నను నిజానికి కుటుంబం దూరంగా పెట్టింది. ఆయన వైవాహిక జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ఆయన కుటుంబానికి దూరంగా ఉన్నారు. ఆయనది ప్రేమ వివాహం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మేనకోడల్ని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆయన ఎప్పుడూ రాజకీయంగా తెలుగుదేశం పార్టీతోనే నడుస్తున్నారు. ఇప్పటి వరకూ రాజకీయ ఆరంగేట్రం గురించి చెప్పలేదు కానీ..చాలా సార్లు ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు తారకరత్నకు టిక్కెట్ ఎలా సర్దుబాటు చేస్తారనేది కీలకం.