విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ నవ్వుల పాలవుతున్నారు. ఆయన తరపున ఎవరినైనా ప్రశ్నిస్తే.. ఓ పది, ఇరవై మంది మహిళల ముఠాను దాడులకు పంపుతున్నారు. కేసులు ఉండవని.. భరోసా ఇచ్చి ఇలా దాడులకు పంపుతున్న వ్యవహారం విజయవాడలో చర్చనీయాంశం అవుతోంది. టీడీపీ నేత పట్టాభిరాం ఇంటిపై రెండు సార్లు జరిగిన దాడుల్లో దేవినేని అవినాష్ పంపిన మహిళా ముఠానే సీసీ కెమెరాల్లో దొరికింది. వారిపై కేసులేమీ పెట్టకపోవడంతో భరోసా లభిచినట్లయింది. ఇదేదో బాగుందని ఆయన కూడా ఆ మహిళా ముఠాలను దాడులకు వాడుకుంటున్నారు.
తాజాగా తన నియోజవర్గంలో గడప గడపకూ వెళ్లిన ఆయనకు ఓ కుటుంబం నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తర్వాతి రోజు ఉదయమే ఇరవై మంది మహిళల ముఠా.. ఆ కుటుంబంపై దాడికి దిగింది. కుటుంబం కళ్లల్లో కారం కొట్టి దాడులకు ప్రయత్నించింది. దీంతో ఆ కుటుంబం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టాల్సి వచ్చింది. విచిత్రంగా పోలీసులు ఆ కుటుంబాన్నే పోలీసు స్టేషన్ లో కూర్చోబెట్టారు. దాడులు చేసిన వారిని పట్టించుకోలేదు.
దేవినేని అవినాష్ తండ్రి నెహ్రూ విజయవాడలో .. ఓ వర్గానికి నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన ఏదైనా డైరక్ట్ రాజకీయాలు చేసేవారు. అయితే ఆయన వారసుడు మాత్రం మహిళల్ని ముఠాలుగా మార్చుకుని.. వారిని దాడులకు పులికొల్పడం… విజయవాడలో నవ్వుల పాలవుతోంది. అవినాష్ చేయగలిగేది ఇదేనా అని జనం గేలిచేస్తున్నారు. అయితే అవినాష్ మాత్రం.. టీడీపీ వాళ్లే దాడులకు పాల్పడుతున్నారని చెప్పుకొస్తున్నారు. అవినాష్ ఏర్పాటు చేసుకున్న లేడీ ముఠాల వ్యవహారం ఇప్పుడు వైసీపీలోనూ లాఫింగ్ స్టాక్ అవుతోంది.