తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు మంగళవారం జీవితంలో మర్చిపోలేనంత షాక్ ఇచ్చింది. ఉదయం ఆయన క్యాడర్ పై హైకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పీల్‌కు కూడా చాన్స్ లేకుండా సాయంత్రానికి ఆయనకు ఊస్టింగ్ ఆర్డర్స్ వచ్చేశాయి. పన్నెండో తేదీ అంటే గురువారమే ఏపీలో రిపోర్టు చేయాలని డీవోపీటీ ఉత్తర్వులు రిలీజ్ చేసేసింది. అంటే ఆయన సీఎస్ పదవిని తక్షణం కోల్పోయినట్లే. హడావుడిగా వెళ్లి సీఎం కేసీఆర్‌తో సమావేశమైనా ప్రయోజనం లేకపోయింది. ఉన్న పళంగా కేసీఆర్ సీఎస్ ను నియమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సీఎస్ సోమేష్ కుమార్ విషయలో తెలంగాణలో అనేక విమర్శలు ఉన్నాయి. ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా ధరణి అంశం ప్రభుత్వాన్ని చికాకు పరుస్తోంది. ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణం అవుతోంది. అయితే ఆయన విధేయుడు కావడంతో కేసీఆర్ ఆయన సీఎస్ గా ఉండగా ఎన్నికలు జరపాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు తేడా కొట్టేసింది. కొత్త సీఎస్ ను ఎంపిక చేసుకోక తప్పడం లేదు. అసలు సీఎస్ గా సోమేష్ ను నియమించడానికి అర్హత లేదని రేవంత్ రెడ్డి చాలా సార్లు ఆరోపించారు.
సోమేష్ రెండు సార్లు సర్వీస్ నుంచి లాంగ్ లీవ్ తీసుకుని ప్రైవేటు సంస్థల్లో పని చేశారు. తనకు అనుకూలమైన ప్రభుత్వాలు వచ్చినప్పుడు సర్వీసులోకి వచ్చారు. ఆయన కంటే ఎనిమిది మంది సీనియర్లు ఉన్నప్పటికీ కేసీఆర్ ఆయనకు సీఎస్ పోస్టు ఇచ్చారు. అలా.. తోటీ ఐఏఎస్‌లలోనూ ఆయనపై వ్యతిరేకత ఉంది. ఇప్పటికిప్పుడు ఏపీకి వెళ్లాలని సోమేష్ అనుకోవడం లేదని తెలుస్తోంది.
తాను ఏపీకి వెళ్లడం కన్నా.. ఐఏఎస్ సర్వీస్ కు రాజీనామా చేయాలని అనుకుంటున్న ట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఏపీకి వెళ్లినా ప్రాధాన్యమైన పోస్టు దక్కదని పదకొండు నెలల పాటు నరకం అనుభవించాలని.. ఇప్పుడు అంత అవసరం లేదని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆయన ఐఏఎస్ పదవికి రాజీనామా చేస్తే వెంటనే కేసీఆర్ సలహాదారు పదవి ఇస్తారని ఆయన నమ్మకంగా ఉన్నారు