ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మార్చి 5నుండి మొదలుకాబోతున్నాయి. వైకాపా ఎమ్మెల్యేలను ఇటీవల తెదేపాలోకి ఆకర్షిస్తున్నందుకు తీవ్ర ఆగ్రహంతో ఉన్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశాలను ఒక మంచి అవకాశంగా ఉపయోగించుకొని తెదేపాపై యుద్ధం ప్రకటించారు. స్పీకర్ కోడెల శివ ప్రసాద రావుకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనుకొన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నట్లు సాక్షి మీడియా ప్రకటించింది. అది కూడా అసెంబ్లీ సమావేశాల మొదటిరోజునే ప్రవేశపెట్టాలని నిర్ణయించుకొన్నట్లు పేర్కొంది.
అయితే అసెంబ్లీలో తమ తీర్మాన్ని గెలిపించుకొనేందుకు తమ పార్టీకి తగినంత సంఖ్యా బలం లేదని తెలిసి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆవేశంతో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వలన ఆయన నవ్వులపాలవడమే కాకుండా తన పార్టీ సభ్యులని కూడా అవమానకర పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చేలా చేస్తున్నట్లవుతుంది. ఆయన ఆవేశానికి, దుందుడుకుతనానికి వైకాపా సభ్యులు మూల్యం చెల్లించుకోవలసి రావచ్చును.
వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై తగిన సలహా ఇచ్చేందుకు స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఏర్పాటు చేసిన అసెంబ్లీ సబ్ కమిటీ, సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చాలా అనుచితంగా వ్యవహరిస్తున్న వైకాపా ఎమ్మెల్యేలు రోజా, కొడాలి నానిలపై కటిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఇప్పటికే రోజాను సభ నుండి ఏడాది కాలానికి సస్పెండ్ చేయబడ్డారు. ఈ సమావేశాలలో స్పీకర్ ఒకవేళ కోడలి నానిపై కూడా చర్యలు తీసుకొన్నట్లయితే సహజంగానే చాలా ఆవేశపరుడయిన జగన్మోహన్ రెడ్డిని మరింత రెచ్చగొట్టినట్లే అవుతుంది. ఈ కారణంగా వైకాపా సభ్యులు కీలకమయిన బడ్జెట్ సమావేశాలలో సభను స్థంభింపజేసేందుకు ప్రయత్నించడం ఖాయంగా కనిపిస్తోంది కనుక వారందరినీ సభ నుండి సస్పెండ్ చేసి సమావేశాలు కొనసాగిస్తారేమో?