నాటు నాటు పాట.. ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోంది. ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. ఈ పాట రాసిన చంద్రబోస్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ”ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. నాటు.. నాటు పాట విశ్వ వేదికపై విజయం సాధించినందుకు రచయితగా చాలా గర్వంగా ఉంది. 28 ఏళ్ల ప్రస్థానం, 850 చిత్రాలు, 3 వేల ఆరు వందలకు పైగా పాటలు… ప్రతీ పాటకూ మదనమే.. ప్రతీ పాటకు జ్వలనమే. ప్రతీ పాటకూ తపస్సు చేశాను. ఇన్నిసార్లు తపస్సు చేస్తే…. ఒక్కసారైనా భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు కదా? `నాటు నాటు` పాటకు భగవంతుడు ప్రత్యక్ష మయ్యాడు. వరాన్ని అందించాడు. ఈ అవకాశం అందించిన కీరవాణికి, ఈ పాటని ఇంత గొప్పగా నృత్య రీతులు అందించిన ప్రేమ్ రక్షిత్‌కు, అద్భుతంగా నాట్యం చేసిన ఎన్టీఆర్, చరణ్‌లకు, ఆలపించిన కాలభైరవకు నా ధన్యవాదాలు” అంటూ ఓ వీడియో విడుదల చేశారు.
ఈ పాటను రాయడానికి చంద్రబోస్ తీసుకొన్న సమయం.. అచ్చంగా 19 నెలలు. ఈ పాట కోసం మూడు పల్లవులు రాశారాయన. అందులో ఓ పల్లవిని రాజమౌళి సెలెక్ట్ చేసుకొన్నారు. ఈ పాటని ఉక్రేయిన్‌లో తెరకెక్కిస్తున్నప్పుడు అప్పటికప్పుడు చివరి లైన్లు మార్చాల్సి వచ్చింది. దాన్ని కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేశారు. 1920నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతుల్ని సరిగ్గా అర్థం చేసుకొని, పాటలో అన్వయించుకొంటూ రాసిన గీతమిది. పైగా.. ప్రేమ్ రక్షిత్ సిగ్నేచర్ స్టెప్పులు, తెరపై చరణ్, ఎన్టీఆర్ చూపించిన వేగం కట్టిపడేశాయి. అందుకే ఇంత ఆదరణ దక్కింది.