చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఒక్క రోజు గ్యాప్లో రిలీజవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని ఏపీ అధికార పార్టీ వాడుకుని కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఏ మాత్రం వెనుకాడదని అందుకే.. ఇద్దరు హీరోల అభిమానులు అప్రమత్తంగా ఉండాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. సినిమాలు వినోదం కోసమేనని అయితే రెండు సినిమాలపై దుష్ప్రచారం చేస్తూ..అడ్డగోలుగా సోషల్ మీడియా ప్రచారాలతో ఒకరి ఫ్యాన్స్ పై మరొకరి ఫ్యాన్స్ ఉసిగొల్పి ఫ్యాన్స్ వార్ చేయడానికి కొంత మంది సిద్దంగా ఉంటారని అలాంటి వారి ట్రాప్లో పడొద్దని నారా లోకేష్ అంటున్నారు.
చిరంజీవి, బాలకృష్ణ రెండు సినిమాలు బాగా ఆడాలని.. ఈ రెండు సినిమాలను తాను చూస్తానని కూడా లోకేష్ చెప్పారు. సినిమాలను రాజకీయాలను మిక్స్ చేయవద్దని.. మనం అంతా ఒకటేనని.. కుల, మత , ప్రాంత వివాదాలు మనల్ని విడదీస్తాయనే సంగతిని గుర్తుంచుకోవాలని లోకేష్ ఫ్యాన్స్ కు సూచించారు. నారా లోకేష్ ఇలాంటి సూచనలు చేయాడానికి కారణం.. ఇటీవలి రాజకీయ పరిణామాలే. చంద్రబాబు, పవన్ భేటీ అయిన తర్వాత రెండు వర్గాల మధ్య విద్వేషాలు పెంచడానికి ప్రో వైసీపీ మీడియా, సోషల్ మీడియా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఓ వివాదాస్పదవ్యక్తితో మూాడు రోజులుగా ట్వీట్లు పెట్టించి.. వాటిని టీవీల్లో చర్చలకు కూడా పెట్టారు. అయితే ఇప్పటి వరకూ అవి హైలెట్ కాలేదు. పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఈ రెండు సినిమాలు రిలీజయిన తర్వాత ఐ ప్యాక్ టీం వేల కొద్ది ఫేక్ అకౌంట్లతో ఫ్యాన్ వార్ సృష్టిస్తారని.. ఇది క్రమంగా కుల గొడవలకు కారణం అయ్యేలా చేస్తారన్న అనుమానాలు బలంగా రాజకీయవర్గాల్లో ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఇలాంటి కుట్రలు చేయడంలో సిద్ధహస్తులని. వారి ట్రాప్లో పడకూడదని లోకేష్ అంటున్నారు. ఈ విషయంలో చిరు, మెగా ఫ్యాన్స్ కూడా సంయమనం పాటిస్తే.. రాజకీయ కుట్రలను తిప్పి కొట్టినట్లే అవుతుంది.