గత ఏడాది సంక్రాంతికి గుడివాడలో జరిగిన కాసినో సంబరాలు ఈ సారి గన్నవరంకు మారాయి. ఇద్దరు మిత్రులు ఒక సారి నువ్వు.. ఒక సారి నేను అని పంచుకున్నారేమో కానీ ఈ సారి గన్నవరంలో పాతిక ఏకరాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. ఓ మినీ కాసినోను సృష్టించారు. లోపల కాసినోల్లో ఉండే జూదాలు ఉంటాయో.. లేకపోతే వివాదం అవుతుందని.. కాయిన్స్ లేకుండా మేనేజ్ చేస్తారో తెలియదు కానీ.. కనీసం రోజుకు లక్షన్నర మంది వచ్చిన జూదం ఆడేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
గన్నవరంలో ఏర్పాట్లన్నీ ఎమ్మెల్యే వల్లభవేని వంశీ కనుసన్నల్లో జరుగుతున్నాయి. ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించిన వాహనాలే అక్కడ తిరుగుతున్నాయి. గతం కన్నా ఈ సారి భారీగా నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. గుడివాడలో జరిగిన కేసినో వ్యవహారంపై ఈడీ ఇప్పటికే దృష్టి సారించింది. టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదులపై స్పందించింది. విచారణ జరుపుతోంది. ఈ కేసినో నిర్వహించిన చీకోటి ప్రవీణ్ కూడా ఈడీ కేసులో ఇరుక్కున్నారు. ఈ కేసుపై ముందు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకోవాల్సి ఉంది.
సాధారణంగా సంక్రాంతి సంబరాలకు కోళ్లపందేలు నిర్వహిస్తూంటారు. ఇది సంప్రదాయమని వాదిస్తూ ఉంటారు. ఇతర జూదాలను మాత్రం పోలీసులు కఠినంగా అణిచివేస్తారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అవే జరుగుతున్నాయి. వైసీపీ నాయకులే పోటీలు పడి ఈ వ్యాపారాలు చేస్తున్నారు. వందల కోట్లు వెనకేస్తున్నారు. ప్రజల జేబులు గుల్ల అవుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం లైట్ తీసుకుంటోంది. అయితే పండగ అంటే జూదం అన్నట్లుగా మార్చేస్తున్న వైసీపీ నేతల తీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది