వైసీపీ హైకమాండ్‌పై అసంతృప్తితో ఉన్న వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు. ఆయనను కాదని మైలవరంలో మరొకరికి సీటిచ్చే చాన్స్ ఉండదు . దీంతో వసంత కృష్ణ ప్రసాద్, ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు… ఎంపీ కేశినేని ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల వసంత నాగేశ్వరరావు ప్రత్యేకంగా కేశినేని నానిని కలిశారు. ఆ తర్వాత కేశినేని నాని.. మైలవరం నియోజకవర్గంలో పర్యటించి.. ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని.. పరోక్షంగా ప్రకటన చేశారు.
దేవినేని ఉమకు.. కేశినేని నానికి పొసగదు . ఈ విషయం టీడీపీలో అందరికీ తెలుసు. అసలు దేవినేని ఉమతో పడని కారణంగానే వల్లభవనేని వంశీ ,కొడాలి నాని వంటి వారు పార్టీని వీడిపోయారని చెబుతూంటారు. కేశినేని నాని కూడా మొదట్లో దేవినేని ఉమపై ఘాటుగానే విమర్శలు చేసేవారు. అయితే ఉమ తర్వాత తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఇతర నియోజకవర్గాల్లో వేలు పెట్టడం లేదు. అయితే ఇప్పుడు మైలవరంలోనే కేశినేని నాని ఆయనకు వ్యతిరేకంగా పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
వసంత కృష్ణ ప్రసాద్ ను టీడీపీలో చేర్చే బాధ్యతను కేశినేని తీసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే చంద్రబాబునాయుడు మొదటి నుంచి కృష్ణా జిల్లాలో దేవినేని ఉమకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడు ఆయనను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి టిక్కెట్ ఇస్తారా లేదా అన్నదానిపై సందేహం ఉంది. అయితే నియోజకవర్గాన్ని మార్చవచ్చని భావిస్తున్నారు. ఏదైనా ఎన్నికలకు ముందుకు కృష్ణా జిల్లాలో రాజకీయాలు మాత్రం వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.