కేసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ఏపీలో మకాం వేశారు. ఆయనకు సంక్రాంతి సీజన్ అంటే.. కోట్ల రూపాయల బిజినెస్ జరిగే సీజన్. గత ఏడాది ఏం జరిగిందో కళ్ల ముందే చూశారు. గత ఏడాది చీకోటి ప్రవీణ్ ఏవరో తెలియదు. కానీ ఈడీ కేసుల్లో విచారణ తర్వాత ఆయన వ్యవహారం హాట్ టాపిక్ అయింది. గుడివాడలోనూ ఆయనే కేసినో నిర్వహించారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు చీకోటి ప్రవీణ్ మరోసారి రంగంలోకి దిగారు. సంక్రాంతి పండుగ అయిపోయే వరకూ ఏపీలోనే మకాం వేస్తున్నట్లుగా ప్రకటించారు. మిత్రుల సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటానని ఆయన చెబుతున్నారు.
విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకుని మీడియాతో మాట్లాడుతూ.. కేసినో ఎవరెవరో ఆడారో అందరి పేర్లు త్వరలోనే బయట పెడతానని ఓ హెచ్చరిక లాంటి స్టేట్ మెంట్ ఇచ్చారు. పండుగ అయిపోయే వరకూ ఏపీలో ఉంటాననే చెప్పుకొచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో కేసినో ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సారి మరింత విస్తృతంగా ఈ జూద క్రీడలు ఉంటాయని అంటున్నారు. ఇలా ప్రచారం జరుగుతున్న సమయంలోనే.. చీకోటి ప్రవీణ్.. సంక్రాంతి వేడుకల పేరుతో ఏపీలోనే మకాం వేయడం కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.
సంక్రాంతి అంటే గతంలో కోడి పందెలు మాత్రమే. కానీ ఇప్పుడు మాత్రం అన్ని రకాల జూదాలు తయారయ్యాయి. అధికార పార్టీ నేతలు సొమ్ము చేసుకోవడానికి కేసినోలనూ రంగంలోకి దించుతున్నారు. వ్యసనపరులు ఇల్లు గుల్ల చేసుకుని జూదం ఆడితే.. రాజకీయ నేతలు.. కేసినోలు పెట్టి.. కోట్లు వెనకేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.