రణస్థలంలో పవన్ కల్యాణ్ చేసిన ఘాటు వ్యాఖ్యలపై సభ ముగిసినప్పటి నుండి.. వైసీపీ మంత్రులు, నేతలు మాట్లాడిన వాళ్లు మాట్లాడినట్లుగానే ఉన్నారు. గురువారం ఓ సారి.. శుక్రవారం మరోసారి ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కల్యాణ్ ను ఘాటుగా తిడుతూనే ఉన్నారు. అంతే కానీ పవన్ కల్యాణ్ వ్యక్తం చేసిన ఒక్క రాష్ట్ర సమస్యలపైనా స్పందించలేదు. అందరి బాధ ఒక్కటే.. పవన్ కల్యాణ్ అలా ఎలా తిడతారని.. సంస్కారం లేదా అనే. తాము అంత కంటే ఎక్కువ తిడతామని చెప్పుకొచ్చారు.
నిజానికి పవన్ కల్యాణ్ అంత ఘాటుగా తిట్టడానికి కారణం ఎవరు ? పవన్ కల్యాణ్ రాజకీయ భాష సున్నితంగానే ఉంటుంది. ఆయన రాజకీయ విమర్శలు ఎప్పుడు పరిధి దాటి చేయలేదు. కానీ పవన్ కల్యాణ్ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని మొదటి నుంచి పవన్ తో పాటు ఆయన కుటుంబాన్ని మంత్రులు ఇష్టారీతిన తిడుతూ వస్తున్నారు. చివరికి రోజా మెగా కుటుంబం అంటూ.. రాజకీయాల్లో లేని వారిని కూడా తీసుకొచ్చి తిట్టారు. ఇలా తిట్టి.. తిట్టి.. చివరికి పవన్ సహనం నశించి ఘాటు వ్యాఖ్యలు చేసేదాకా తీసుకు వచ్చారు. ఇప్పుడేమో పవన్ కు సంస్కారం లేదా అని ప్రశ్నిస్తున్నారు.
తాము పవన్ కల్యాణ్ ను ఎలాగైనా తిట్టవచ్చు కానీ.. తమను మాత్రం పవన్ పల్లెత్తు మాట అనుకూడదన్నట్లుగా వైసీపీ నేతల తీరు ఉంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నట్లుగా.. రాజకీయ విమర్శలను పరిమితుల్లోనే ఉంచితే.. ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. తమ పదవులు కాపాడుకోవడానికి.. తమ అధినేతను మెప్పించడానికి ఇతరులపై ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడేసి.. తిరిగి తిడితే ఇదేనా సంస్కారం అని అనడం వైసీపీ నేతలకే చెల్లింది.
ఇప్పుడు వైసీపీ నేతలు మాట్లాడిన మాటలకు…వారు అధికారంలో ఉన్నారు కాబట్టి.. చాలా మంది సైలెంట్ ఉన్నారు. రేపు వారి పదవులు పోయాక.. ఎదర్కొనే స్పందన భిన్నంగా ఉంటుందని ఇప్పటికే అనేక మంది విశ్లేషిస్తున్నారు. అయినా పదవులు శాశ్వతం అనుకుని వైసీపీ మంత్రులు చెలరేగిపోతున్నారు.