భారత రాష్ట్ర సమితికి ఇతర రాష్ట్రాల్లో చీఫ్‌లను నియమించడానికి కేసీఆర్ చేస్తున్న కసరత్తు చివరికి.. షెడ్డుకెళ్లిపోయిన నాయకుల దగ్గర ఆగుతోంది. ఏపీలో ఎవరూ దొరకనట్లుగా ప్రధాన పార్టీల తరపున పోటీ చేసిన ప్రతీ సారి ఓడిపోయిన తోట చంద్రశేఖర్ కు చాన్సిచ్చారు. అంతకు మించిన నేతను ఆకర్షించలేకపోయారు. తాజాగా ఒడిషాకు గిరిధర్ గమాంగ్‌ను అనే సీనియర్ నేతకు బీఆర్ఎస్ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆయన సాంకేతికంగా ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడో కాడి దించేశారు. ఒడిషా సంప్రదాయ కళాకారుడైన ఆయన ప్రదర్శనలు ఇస్తూ సమయం గడపుతున్నారు. ఆయన వయసు ఎనభై దగ్గరకు వచ్చింది.
గిరిధర్ గమాంగ్ పలుమార్పు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. 1999లో ఆరేడు నెలల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఎంపీగా ఉన్న సమయంలో ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు. ఆ సమయంలో ప్రధానమంత్రిగా వాజ్ పేయి ఉండేవారు. అప్పుడు జరిగిన విశ్వాస పరీక్షలో సీఎంగా ఉన్నప్పటికీ ఎంపీ పదవికి రాజీనామా చేయకపోవడంతో వచ్చి ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇది నైతిక విరుద్ధమన్న ప్రచారం జరిగింది. అప్పట్లో బలాబలాలు చాలా క్లిష్టంగా ఉండటంతో చివరికి ఒక్క ఓటు తేడాతో వాజ్ పేయి ప్రభుత్వం కూలిపోయింది. ఈ కారణంగా ఎన్నికలు వచ్చాయి. అయితే అప్పటి నుండి ఆయన మరోసారి ఎన్నికల్లో గెలవలేకపోయారు.
ఆ తరవాత ఆయన కాంగ్రెస్ పార్టీకి కూడా దూరమయ్యారు. ప్రస్తుతం వయసు కారణంగా గిరిధర్ గమాంగ్ యాక్టివ్ గా ఉండలేకపోయారు. ఆయన తన రాజకీయ వారసుడిగా చెబుతున్న కుమారుడు శిశిర్ గమాంగ్ రాజకీయ భవిష్యత్ ను తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీలోనూ ప్రస్తుతానికి ఆయనకు ప్రాధాన్యత లేదు. అందుకే కేసీఆర్ ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ కి తెలంగాణ చీఫ్ గా ఉండాలనే ఆఫర్ ఇచ్చారు. అయితే గమాంగ్ వల్ల బీఆర్ఎస్క ఎలాంటి లాభం ఉండదన్న వాదన ఎక్కువ వినిపిస్తోంది.
ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి నేతలను కూడా కేసీఆర్ ఇంకా ఆకర్షించలేకపోయారు. అయితే ఇలా … రిటైరైన నాయకుల్ని తీసుకొచ్చి బాధ్యతలిస్తే బీఆర్ఎస ఇమేజ్ మొదటికే తేలిపోతుందని ఆ పార్టీ నేతలు కంగారు పడుతున్నారు.