తెలంగాణ జాగృతిని భారత్ జాగృతిగా మార్చిన సమయంలో ఏపీలో భోగి పండుగను ఘనంగా నిర్వహిస్తారని.. కానీ ఇటీవల ప్రాధాన్యం తగ్గుతోందని..తాము మళ్లీ పాత వైభవం తెస్తామన్నట్లుగా ప్రకటించారు. ప్రకటనకు తగ్గట్లుగానే భోగి వేడుకలు నిర్వహించారు కానీ. ఏపీలో కాదు.. తెలంగామలోనే నిర్వహించారు. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కు వద్ద భారత జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకల్లో నిర్వహించారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శన, ఒగ్గు కళాకారుల నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవిత.. బోగీ మంటలను వెలిగించారు. అనంతరం మాట్లాడిన ఆమె.. తెలంగాణ జాగృతి.. భారత జాగృతిగా మారిన తరువాత మొదట కార్యక్రమంగా సంక్రాంతి లాంటి పెద్ద పండుగ రావడం గర్వకారణమన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మ వంటి సంప్రదాయాల్ని ఉద్యమంతో కలిపేందుకు ఏర్పాటు చేసి సాంస్కృతిక భావోద్వేగం తీసుకు వచ్చిన తెలంగాణ జాగృతి ఇటీవల టీఆర్ఎస్ .. బీఆర్ఎస్గా మారినప్పుడే భారత్ జాగృతిగా మారిపోయింది. ఈ జాగృతి సంస్థను కవిత నిర్వహిస్తూంటారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను బతుకమ్మ స్టైల్లోనే నిర్వహిస్తామని ప్రకటించారు. అందులో భాగంగా భోగి పండుగను తొలి సారి భారత్ జాగృతి తరపున నిర్వహించారు . అయితే ఆంధ్రాకు వెళ్లలేదు. హైదరాబాద్లోనే నిర్వహించారు.
అయితే కవిత మాటలు అందరికీ కాస్త ఎబ్బెట్టుగానే అిపించాయి. నిన్నటి దాక తెలంగాణ అస్తిత్వం, సాంప్రదాయంపై గొంతెత్తిన ఎమ్మెల్సీ కవిత తెలుగు సంస్కృతి అంటూ ప్రసంగించారు. సంక్రాంతి అంటేనే సంస్కృతి, సంప్రదాయాలకు నిలువటద్ధమని చెప్పారు. పాత ఆలోచనలను బోగి మంటలలో వేసి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. నిజానికి ఒకప్పుడు తెలుగు తల్లి ఎక్కడ ఉందని.. తెలుగు తల్లిని పక్కన పెట్టి..తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించుకున్నారు. ఇవాళ తెలుగు సంస్కృతి గురించి వారే మాట్లాడుతున్నారు. కాల మహిమ అంటే ఇదే అనుకోవాలేమో?