తెలంగాణ మంత్రి కేటీఆర్ బడ్జెట్ ప్రిపరేషన్స్ ప్రారంభమయినప్పటి నుంచి కేంద్ర మంత్రులకు వరుసగా లేఖలు రాస్తూంటారు. తెలంగాణకు నిధులు చాలా అవసరమని ఆయా రంగాలకు నిధులు కేటాయించాలని అన్ని శాఖల తరపున దాదాపుగా ఆయనే లేఖలు రాస్తూంటారు. అయితే కేటీఆర్ అధికారికంగా ఓ రాష్ట్ర మంత్రి మాత్రమే. ఆయన రాసే లేఖలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందా అంటే.. కష్టమే. ఎందుకంటే గతంలోనూ కేటీఆర్ లేఖలు రాశారు. వాటిని మీడియాలో ప్రచారం చేసుకోవడానికి తప్ప ఉపయోగపడలేదు. కేంద్రం నిధుల కేటాయింపు కోసం పరిగణనలోకి తీసుకోలేదు.
ఈ సారి కూడా కేటీఆర్ వరుస లేఖలు రాస్తున్నారు. అన్నీ గతంలో అడిగినవే. నిధులు కేటాయించాలని.. తెలంగాణ వంటి రాష్ట్రానికి నిధులు కేటాయిస్తే అభివృద్ధి చెందుతుందని.. తెలంగాణ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్లేనని చెబుతున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం ఈ లేఖలన్నీ ఫార్స్ అని.. నిజంగా నిధుల కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించాలనుకుంటే.. నేరుగా సీఎం కేసీఆర్ లేఖలు రాయాలని.. కేంద్రమంత్రులను కలిసి ఒత్తిడి తెచ్చుకోవాలని అంటున్నారు. ఊరికే ఓ లేఖ రాసి మీడియాకు విడుదల చేస్తే నిధులు ఇచ్చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.
అయితే బీఆర్ఎస్ వర్గాలు మాత్రం తాము గత ఎనిమిదేళ్లుగా కేంద్రం చుట్టూ తిరుగుతూనే ఉన్నామని గుర్తు చేస్తున్నారు. ఎన్ని సార్లు అడిగినా ప్రత్యేకమైన నిధులు కేటాయించడం లేదని.. ఇప్పుడు కొత్తగా అడగడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మా బాధ్యతగా లేఖలు రాస్తున్నామని.. బీజేపీకి కనీస బాధ్యత లేదు కాబట్టే.. తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదంటున్నారు. ఎప్పుడు బజ్దెట్ వచ్చినా ఈ అంశంలో బీఆర్ఎస్ , బీజేపీ మధ్య రచ్చ జరగడం ఖాయంగా జరుగుతూనే ఉంది.