తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎలాంటి పెట్టుబడి చాన్స్ ఉన్నా ఎంత దూరం అయినా వెళ్లేందుకు వెనుకాడటం లేదు. రాజకీయంగా తెలంగాణలో చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు దర్యాప్తు సంస్థలు ఎవరి మీద విరుచుకుపడతాయో అర్థం కాని పరిస్థితి అయినా కేటీఆర్ మాత్రం.. పెట్టుబడుల కోసం ఏ చిన్న అవకాశం వచ్చినా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఆయన పండగు సంబరాలు కూడా పూర్తి కాకుండా అధికారుల బృందం దావోస్ బయలుదేరారు.
16 నుంచి 20 వరకు జరుగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు-2023లో పాల్గొనేందుకు కేటీఆర్ అధికార బృందంతో వెళ్లారు. ఈ ఏడాది సదస్సును ‘కోఆపరేషన్ ఇన్ ఫ్రాగ్మెంటెడ్ వరల్డ్’ అనే థీమ్‌పై నిర్వహిస్తున్నారు. సదస్సులో ప్రత్యేకంగా తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేశారు. అక్కడ ప్రపంచ అగ్రగామి సంస్థల అధిపతులతో మంత్రి కేటీఆర్ సమావేశం అవడంతోపాటు డబ్ల్యూఈఎఫ్ ఏర్పాటుచేస్తున్న వివిధ బృంద చర్చల్లో పాల్గొంటారు. తెలంగాణ ప్రతినిధి బృందం 2021 మినహా 2018 నుంచి ఈ సదస్సులో పాల్గొంటున్నది.
మంత్రి కేటీఆర్ డబ్ల్యూఈఎఫ్‌లో గతంలో చేసిన ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ప్రముఖులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. ప్రతిసారి తెలంగాణ అనుకూలతలు, ఇక్కడి పారిశ్రామిక విధానాలను అందరికీ హత్తుకొనేలా కేటీఆర్ వివరిస్తున్నారు. కేటీఆర్ వివరించిన తీరుకు ముగ్ధులైన పలువురు పారిశ్రామికవేత్తలు గత ఏడాది సమావేశాల సందర్భంగా తెలంగాణలో రూ.4,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. ఈ ఏడాది అంతకుమించి పెట్టుబడులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రాజకీయంగా కేటీఆర్ పై ఎన్ని విమర్శలు చేసినా .. తెలంగాణకు పెట్టుబడుల సాధన విషయంలో ఆయన ప్రయత్నాలను మాత్రం ఎవరూ తప్పుపట్టరు. పూర్తి స్థాయిలో తెలంగాణ కోసం పని చేస్తారని రాజకీయ ప్రత్యర్థులు కూడా నమ్ముతారు.