ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి అనేక సమస్యలు ఉన్నాయి. నాయకులు ఎక్కువై పోయారు. సీట్లు తక్కువగా ఉన్నాయి. పోటీకి చాన్స్ ఇవ్వకపోతే ఇతర పార్టీల్లోకి వెళ్లి పోటీ చేస్తామని బెదిరించే వారు ఎక్కువైపోయారు. ఉన్న నేతలు సరిపోరనుకుంటే.. కొత్తగా.. తెలంగాణ హెల్త్ డైరక్టర్ గడల శ్రీనివాసరావు కొత్తగూడెం అసెంబ్లీ సీటు కావాలంటూ హంగామా చేస్తున్నారు. ఆయన ఎక్కువగా కొత్తగూడెంలోనే ఉంటున్నారు. ఏదో విధంగా పబ్లిసిటీ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తన పేరుతోనే ట్రస్ట్ పెట్టి చిన్న చిన్న సేవా కార్యక్రమాలు నిర్వహించి దానికి ఎక్కువ పబ్లిసిటీ వచ్చేలా చేసుకుంటున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త గూడెం నుంచి పోటీ చేయాలని డీహెచ్ శ్రీనివాసరావు అనుకుంటున్నారని అందుకే ఇటీవలి కాలంలో అక్కడే ఎక్కువగా తిరుగుతున్నారన్న వానద వినిపిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడం ఓ సందర్భంలో వివాదాస్పదమయింది. అయితే ఈ విషయంలో ఆయన కేసీఆర్ పై భక్తిని ప్రదర్శించారు. ఇటీవల క్రిస్మస్ వేడుకలను కూడా ఆయన కొత్తగూడెంలోనిర్వహించారు. కొత్త గూడెం జిల్లాలో డీఎస్ఆర్ ట్రస్ట్ తరపున ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశఆరు. యేసు క్రీస్తు కృప వల్లే కరోనా నుంచి మనం విముక్తి అయ్యామని.., మనం చేసిన సేవల వల్ల కాదు అంటూ వ్యాఖ్యానించారు.
ఇదంతా అసెంబ్లీ టిక్కెట్ కోసమేనని బీఆర్ఎస్ వర్గాలు ఓ అభిప్రాయానికి వచ్చాయి. ప్రస్తుతం కొత్తగూడెంలో కాంగ్రెస్ తరపున గెలిచిన బీఆర్ఎస్ లో చేరిన వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు వయసు మీదపడింది. ఆయన రాజకీయ వారసుడు అనేక వివాదాల్లో ఉన్నారు. ఈ కారణంగా అభ్యర్థిని మారుస్తారన్న ప్రచారం ఉంది. దీంతో గడల శ్రీనివాసరావు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారని అంటున్నారు. పోటీ తీవ్రంగా ఉంటే.. ఇప్పుడు మధ్యలో ఈ అధికారి చేస్తున్న రచ్చ ఖమ్మం బీఆర్ఎస్ పార్టీతో పాటు.. అగ్రనేతలకూ చికాకు తెప్పిస్తూనే ఉంది.