ఏపీ బీఆర్ఎస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తోట చంద్రశేఖర్‌కు కేసీఆర్ మొదటి టాస్క్ ఇచ్చారు. కనీసం లక్ష మందిని ఆవిర్భావ సభకు తరలించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లుగా తెలుస్తోంది. మొత్తం ఐదు లక్షల మందితో ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి కూడా జనాల్ని సమీకరించే లక్ష్యంతో అక్కడ సభ ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ఇందు కోసం .. ఎలాంటి సాయం కావాలన్న బీఆర్ఎస్ పార్టీ తరపున చేస్తామని జనాన్ని మాత్రం సమీకరించాలని చెప్పి పంపినట్లుగా తెలుస్తోంది.
బీఆర్ఎస్ ఫ్లెక్సీలను సంక్రాంతి సందర్భంగా కొన్ని చోట్ల పెట్టించారు. అయితే అడ్వర్టైజింగ్ ఏజన్సీ సాయంతో ఈ ఫ్లెక్సీలు పెట్టించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా డిజైన్ లో ఉన్నాయి ఫ్లెక్సీలు. ఏ ఒక్క చోట కూడా.. తోట చంద్రశేఖర్, రావెల తప్ప స్థానిక నేతల ఫోటోలు లేవు. అంటే.. స్థానిక నేతలెవరూ ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయలేదన్నమాట. తోట చంద్రశేఖర్ కు .. జనాల్లో ఎలాంటి పలుకుబడి లేదు. రావెల కిషోర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. వీరు ఖమ్మం సభకు జన సమీకరణ చేయడం అంత తేలిక కాదన్న వాదన వినిపిస్తోంది.
కేసీఆర్ లక్ష మందిని తరలించాలని టార్గెట్ పెట్టినా.. కనీసం ఊరికొక బస్సు పెట్టి తీసుకు రావడం కూడా కష్టమన్న వాదన ఉంది. ఖమ్మం పొరుగున కృష్ణ జిల్లా ఉంది. ఆ జిల్లా నుంచి జనాల్నితరలించడం అంత తేలిక కాదు ఇక గుంటూరు నుంచి తరలించాల్సి ఉన్నా.. దూరాభారమే. తోట చంద్రశేఖర్ కు కేసీఆర్ పెట్టిన మొదటి టాస్క్ ను ఎలా అధిగమిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం ఫ్లెక్సీలు చూపిస్తూ.. ఏపీలో బీఆర్ఎస్ ప్రభంజనం అన్నట్లుగా ప్రచారం చేసేసుకుంటున్నారు.