ఇప్పుడు అన్ని ప్రభుత్వాల ప్రతినిధులు దావోస్‌లో మకాం వేసి.. మా రాష్ట్రానికి రండి అంటూ పెట్టుబడుల వేట సాగిస్తూంటే.. ఒక్క ఏపీ మాత్రమే నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. ఏపీలో పరిస్థితులు చూసి అసలు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సే.. ఏపీని పట్టించుకోలేదని.. పిలువలేదన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఉడుక్కున్న ప్రభుత్వం… మమ్మల్ని పిలిచారని చెబుతూ.. లేఖ బయట పెట్టింది. ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఇలాంటి విషయాల్లో చురుగ్గా ఉంటుంది. ఈ సారి కూడా అంతే. ప్రపంచ ఆర్థిక వేదిక పంపిన లేఖను పోస్ట్ చేసిది.
గత ఏడాది నవంబర్ 25వ తేదీనే ఈ ఆహ్వాన పత్రిక ఏపీ ప్రభుత్వానికి అందిందని.. అందులో జగన్ సోషియో ఎకనామిక్ డెలవప్‌మెంట్ ని పొగిడారని కూడా చెప్పుకున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా.. మరి ఎందుకు వెళ్లలేదన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అసలు ఆ అంశం ప్రస్తావించలేదు. వాళ్లు పిలిచాం..మేమే బెట్టు చేశాం.. వెళ్లకూడదనుకున్నాం అన్నట్లుగా ప్రభుత్వ స్పందన ఉంది. గత ఏడాది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా దావోస్ వెళ్లారు. లక్ కోట్లరుపైగా పెట్టుబడులు ఆకర్షించారని ప్రభుత్వం ప్రకటించింది. అంత పెట్టుబడులు సాధిస్తే ఈ సారి ఎందుకు వెళ్లలేదు ? . ఏపీకి పెట్టుబడులు ఆకర్షించాలని లేదా ? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం త్వరలో విశాఖలో ప్రపంచ పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు పెద్ద ఎత్తున ప్రముఖుల్ని ఆహ్వానించాలని అనుకుంటోంది. దావోస్ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి పలు కంపెనీల సీఈవోలు, చైర్మన్లు హాజరు కానున్నారు. ముఖ్యంగా ఇన్వెస్టర్లను తరలి రావాలని కోరుతోంది. ఇలాంటి సమయంలో… ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు సీఎం నేతృత్వంలో ప్రతినిధి బృందం వెళ్లినట్లయితే.. అక్కడే అందరికీ వ్యక్తిగతంగా ఆహ్వానం ఇచ్చినట్లు ఉండేదన్న వాదన పారిశ్రామిక వర్గాల్లో వినిపిస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం.. పిలిచారు కానీ పోలేదని.. చెప్పుకుంటోంది.