తెలుగు జాతి ఉన్నంత కాలం మర్చిపోని పేరు ఎన్టీఆర్. మొదట సినీ రంగంలో తర్వాత రాజకీయ రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన మేరునగధీరుడు. ఎక్కడ అడుగుపెట్టినా తనదైన విలువలు, సిద్దాంతాలకు కట్టుబడి ఉన్న నేత. తన నిర్ణయాలతో లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసిన ప్రభావ శీలి. ఆయన వర్థంతి నేడు.
ఎన్టీఆర్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఆయన గురించి అందరికీ తెలుసు . ప్రతీ వర్థంతి.. జయంతికి మాత్రమే కాదు.. ఏ సినిమా పండుగ జరిగినా.. ఏ సంక్షేమ కార్యక్రమం జరిగినా ఆయన గురించి చర్చ ఉంటుంది.ఆయన వేసిన ముద్ర అలాంటిది. ఆయన చనిపోయి.. 27 ఏళ్లు అవుతున్నప్పటికీ.. ఆయన వేసిన ముద్ర రాజకీయాల్లో ఇప్పటికీ ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది.
ఈ రోజు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల్ని చూస్తే.. అత్యధిక మంది అగ్రనేతలు ఆయన నీడలోనే పెరిగారు. రాజకీయంగా ఎదిగారు. ఎన్టీఆర్ బడుగు, బలహీన వర్గాలను రాజకీయంగా పైకి తీసుకు వచ్చారు. ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశంతో రాజకీయాల్లోకి వచ్చి .. ఆయా వర్గాలను పైకి తీసుకురావడంలో రాజకీయ నేతలు ఎంతో సక్సెస్ అయ్యారు. తెలంగాణలో ఎన్టీఆర్ తీసుకున్న అనితర సాధ్యమైన నిర్ణయాలతో .. ప్రజలకు ఎన్నో బాధల నుంచి విముక్తి లభించింది. రాజకీయంగా బీసీలు ఎదిగారు. ఈ రోజున తెలంగాణలో బీసీ నేతలు ఎంత బలంగా తయారయ్యారంటే.. సీఎం పదవికి కూడా పోటీ పడుతున్నారు. అది ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాల ఫలితమేనని.. అందరూ స్మరించుకుంటారు.
ఈ రోజు పథకాలంటూ ప్రచారం చేసుకునే అందరి కంటే ముందే అసలు పథకాలు అనే మాటకు అర్థం తెచ్చి పెట్టారు. అప్పులు చేయకుండానే .. సంపాదనతోనే ప్రజలకు సేవ చేశారు. మంచి చేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో బ్లాక్ అండ్ వైట్ ఉన్నట్లే. .. ప్రజల దృష్టిలో దేవుడిగా ఉన్నప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఆయన జీవిత చరమాంకం వివాదాస్పదమయింది. అయితే ఆ విషయాన్ని తెలుగు ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు.
కానీ ఎన్టీఆర్ అనే మహావ్యక్తిని మాత్రం తెలుగు జాతి ఉన్నంత కాలం ఎవరూ మర్చిపోరు..ఎందుకంటే ఆయన తెలుగు ప్రజల జీవితాల్ని అలా ప్రభావితం చేశారు మరి.
జోహార్ ఎన్టీఆర్ !