కర్నూలుకు రాజధాని ఇస్తున్నట్లుగా ప్రకటించి మోసం చేశారన్న అనుమానాలు పెరిగిపోతూండటంతో అక్కడి ప్రజల్లో అసహనం పెరుగుతోంది. కర్నూలు ప్రభుత్వం న్యాయరాజధాని ఇస్తున్నట్లుగా ప్రకటించింది. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. న్యాయరాజధాని ఆలోచన విరమించుకున్నామని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలియచేయడం సంచలనం సృష్టించింది. తర్వాత జ్యూడిషియల్ అకాడమీని కర్నూలులో ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించి.. జీవో ఇచ్చి చివరి క్షణంలో మార్చారు. ఇప్పుడు కేఆర్ఎంబీని కూడా విశాఖకు తరలిస్తున్నారు. ఇవన్నీ వివాదాస్పదమవుతున్నాయి. అసలు కృష్ణాబోర్డుకు విశాఖకు ఏమిటి సంబంధం అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డును కర్నూలులో పెట్టాలన్న డిమాండ్ కు ఇతర ప్రాంతాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. అయినా ప్రభుత్వం మొండిగా విశాఖ తరలించాలని అనుకుంటోంది. దీంతో అక్కడి ప్రజలు ఉద్యమానికి సిద్ధమయ్యారు. ధర్మదీక్షల పేరుతో రాయలసీమ పరిరక్షణ సమితి నంద్యాల కలెక్టరేట్ వద్ద ధర్నాలుచేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఉద్యమాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని చెబుతున్నారు. ఇప్పటికే న్యాయరాజధాని పేరుతో గర్జనలు చేశారు. కానీ అది వైసీపీ వ్యూహంలో భాగం. రాజకీయంగా మద్దతు లభించింది.
ధర్మదీక్షలు మాత్రం పూర్తిగా రాయలసీమ ప్రయోజనాల కోసం ఉద్యమకారులు చేస్తున్నదే. నియంత్రించాలని చూస్తే మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఇదంతా వైసీపీ స్వయం కృతమని.. రాజకీయాల కోసం.. కర్నూలు రాజధాని పేరుతో మభ్య పెట్టడం వల్ల ఇదంతా జరుగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. త్వరలో ఒక్కటే రాజధానిగా విశాఖను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో… కర్నూలులో ఇలాంటి సెంటిమెంట్ ప్రచారం ప్రారంభం కావడం.. వైసీపీకి ఇబ్బందికరమే.