గంటా శ్రీనివాసరావు ఎన్నికల వేడి పెరుగుతూండటంతో మళ్లీ యాక్టివ్ అయ్యే ఆలోచనలో ఉన్నారు. ఆయన నారా లోకేష్ పాదయాత్ర కోసం తెర వెనక సాయం అందిస్తున్నారన్న ప్రచారం టీడీపీలో సాగుతోంది. ఇటీవల గంటా శ్రీనివాసరావు హైదరాబాద్లో లోకేష్ తో సమావేశం అయ్యారు. ఆయన టీడీపీకి దూరంగా ఉన్న అంశంపై చర్చ జరిగింది. ఇక ముందు ఉంటారా.. ఉండరా అన్న అంశంపైనా క్లారిటీ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. గంటా శ్రీనివాసరావు తాను పార్టీ మారేది లేదని చెప్పడంతో.. పాదయాత్రకు సంబంధించి బ్యాక్ గ్రౌండ్ వర్క్ అప్పగించినట్లుగా చెబుతున్నారు. తాజాగా గంటా .. టీడీపీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు.
విశాఖ టీడీపీ కార్యాలయంలో.. ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న ాయన నారా లోకేష్ ప్రారంభిస్తున్న యువగళం పాదయాత్ర సెన్సేషనల్ హిట్ అవుతుందని గంటా శ్రీనివాసరావు జోస్యం చెప్పారు. లోకేష్ పాదయాత్ర ఈ నెల 27 నుంచి ప్రారంభం అవుతుందని.. 400 రోజులు..4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారని గంటా శ్రీనివాస్ తెలిపారు. 175 నియోజక వర్గాల్లో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. దేశానికి యువత వెన్నుముక..అలాంటి యువత రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు పడుతోందని .. అందుకే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని.. ఈ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నామని గంటా శ్రీనివాస్ తెలిపారు.
గంటా శ్రీనివాసరావు చాలా కాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీ సమావేశాలకూ హాజరు కావడం లేదు. ఈ కారణంగా పలుమార్లు ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం జరిగింది. అయితే ఇటీవల టీ డీపీ నేత నారా లోకేష్ తో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు సుమారు 40 నిమిషాల పాటు చర్చించుకున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు రావాలని అధిష్టానం కోరిన ఆయన హాజరుకాలేదు. పార్టీ సభ్యత్వ విషయంతో పాటూ కమిటీల ఏర్పాటుపై గంటా శ్రద్ధ పెట్టలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే అటు చంద్రబాబు కానీ.. ఇటు లోకేష్ కానీ గంటాను ఎప్పుడూ తప్పు పట్టలేదు. అందుకే గంటా మళ్లీ టీడీపీలో యాక్టివ్ అవుతున్నట్లుగా భావిస్తున్నారు.