నెల్లూరు వైసీపీలో ముందు ముందు సునామీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. వైసీపీపై అసంతృప్తితో ఇంత కాలం సైలెంట్ గా ఉన్న నేతలు ఇప్పుడు ఒక్క సారిగా తమ దారి తాము చూసుకునే ఆలోచనలో ఉన్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఇప్పటికే డిసైడయ్యారు. ఆయన తీరును చూసి వైసీపీ కూడా దూరం పెట్టింది. కానీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరో వైపు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా చాలా కాలంగా వైసీపీ హైకమాండ్ పైఅసంతృప్తిగా ఉన్నారు. ఆయనతో పాటు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అసలు రాజకీయాల్లో కనిపించడం మానేశారు. ఈ ముగ్గురితో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చర్చలు జరపడం హాట్ టాపిక్ గా మారింది. ల
మాగుంట నివాసంమలో అదాల ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డితో పాటు మాగుంట శ్రీనివాసులరెడ్డి.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య చర్చలు జరిగినట్లుగా ఫోటో వెలుగులోకి వచ్చింది. వీరు ఏ సందర్భంలో కలిశారు.. అన్నదానిపై స్పష్టత లేదు .కానీ రాజకీయం లేదని మాత్రం ఎవరూ అనుకోవడం లేదు. వీరు ముగ్గురు గతంలో టీడీపీలోనే ఉండేవారు. గత ఎన్నికలకు ముందు ఒకరి తర్వాత ఒకరు వైసీపీలో చేరిపోయారు. ఆనం రామనారాయణరెడ్డి ముందే వైసీపీలో చేరి వెంకటగిరి టిక్కెట్ ఇప్పించుకున్నారు. అభ్యర్థిత్వం ఖరారు చేసిన తర్వాత సైలెంట్ గా వైసీపీలో చేరి .. ఆ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేశారు ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఇక మాగుంట శ్రీనివాసుల రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీగా ఉండేవారు. కానీ ఆయన కూడా వైసీపీలో చేరి ఎంపీ అయ్యారు.
వైసీపీలో చేరిన తర్వాత వీరెవరికీ సరైన ప్రాధాన్యం లభించలేదు. పైగా వర్గ పోరాటంతో వారు అసలు తెరపైకి కనిపించడమే మానేశారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మరోసారి వీరు రాజకీయం ప్రారంభించారు. వీరిని సోమిరెడ్డి టీడీపీలోకి ఆహ్వానించారా.. ఆహ్వానిస్తే వారు ఎలా స్పందించారు అన్న విషయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ భేటీపై ఈ ముగ్గురు నేతల నుంచి ఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు.