కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకుండా కేసీఆర్ కుట్రలు మొదలు పెట్టారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కర్ణాటక లో 25 మంది కాంగ్రెస్ నేతలతో సీఎం కేసీఆర్ రీసెంట్ గా మాట్లాడారని.. వారికి రూ. 500 కోట్ల ఆఫర్ ఇచ్చారని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తన ఫామ్ హౌస్ కు పిలిచి మాట్లాడిన విషయం మా అధిష్టానానికి తెలిసిందని.. మా వాళ్లకు ఏఐసీసీ క్లాస్ తీసుకుందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. హైదరాబాద్లోని సునీల్ కనుగోలు ఆఫీసుపై దాడి చేయడానికి ప్రధాన కారణం.. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను చోరీ చేయడమేనని రేవంత్ రెడ్డి ఆరోపణ.
సునీల్ కనుగోలు రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్ పనిచేస్తున్నాడని.. సునీల్ కనుగోలు ఆఫీస్ పై దాడి వెనుక చాలా కారణాలున్నాయని చెబుతున్నారు. మార్జిన్ తో గెలిసే నేతలను టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారని.. ఈ విషయం కుమారస్వామికి కూడా తెలీదన్నారు. ఇవ్వాళ బిఆర్ఎస్ మీటింగ్ కు కుమారస్వామి రాకపోవడానికి అదే కారణమని రేవంత్ రెడ్డి అన్నారు . బీజేపీ పై పోరాడుతా అంటుంన్న కేసీఆర్..కాంగ్రెస్ ను ఎందుకు ఓడించాలనుకుంటున్నారని.. ఈ విషయం నిజం కాదంటే.. కేసీఆర్ ఖండించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రస్తుత ప్రభుత్వాన్ని కేసీఆర్ ఫిబ్రవరి చివరి వారంలో రద్దు చేస్తారని.. కర్ణాటకతో పాటే ఎన్నికలకు వెళ్తారని.. బడ్జెట్ సమావేశాలకు కూడా అసెంబ్లీని సమావేశ పర్చాలని కేసీఆర్ అనుకోవడం లేదని.. రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కుమారస్వామి ఎందుకు రాలేదో కానీ.. సునీల్ కనుగోలు ఆఫీస్ పై దాడి చేసి.. కంప్యూటర్లన్నింటినీ పోలీసులు తీసుకెళ్లడంపై కాంగ్రెస్ నేతలు కొంత కాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను తస్కరించడానికే ఇలా చేశారని ఆరోపిస్తున్నారు.