ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ట్రాప్ చేసి పట్టుకున్న ఫామ్ హౌస్ కేసు ఎటూ కాకుండా ఇరుక్కుపోయింది. సిట్ దర్యాప్తును వేసి.. బీఎల్ సంతోష్ లాంటి బీజేపీ పెద్ద తలకాయని ఇరికించేయడానికి చాలా ప్రయత్నాలు జరిగినా చివరికి రివర్స్ అయింది. హైకోర్టు కేసును సీబీఐకి ఇచ్చింది. కానీ విచిత్రంగా సీబీఐ విచారణ ప్రారంభించలేదు. ప్రభుత్వం తీరిగ్గా అప్పీల్‌కు వెళ్లింది. హైకోర్టు డివిజన్ బెంచ్‌లో విచారణ ముగిసింది. కానీ తీర్పు రిజర్వ్ అయింది. ప్రభుత్వం తరపులాయర్లు వాదించడమే కాకుండా.. లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని చెప్పడంతో 30వ తేదీకి వరకూ గడువు ఇచ్చింది. దీంతో తీర్పు ఈ లోపు రాదని తేలిపోయింది.
అప్పటి వరకూ సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించే అవకాశం లేదని భావిస్తున్నారు. సీబీఐ విచారణపై హైకోర్టు ఎటువంటి స్టే ఇవ్వలేదు. సీబీఐ అనకుంటే ఇప్పుడు విచారణ ప్రారంభించవచ్చు. కానీ సీబీఐ మాత్రం ఇంకా విచారణ ప్రారంభించలేదు. విచారణకు అనుమతి కోసం తెలంగాణ ప్రభుత్వానికి సీబీఐ లేఖ రాసింది. ఫామ్ హౌస్ కేసు సీబీఐకి బదిలీ చేసిన క్రమంలో ఎఫ్ ఐ ఆర్ నమోదుకు అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం జనరల్ కన్సెంట్ ను రద్దు చేయడంతో.. విధిగా అనుమతి తీసుకోవాల్సి ఉంది.
అయితే హైకోర్టు ఆదేశించినందున అనుమతి నిరాకరించడానికి వీల్లేదు అయితే ఈ కేసుపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు డిజిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లింది కనుక తీర్పు వచ్చే వరకూ చూడాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ కారణంగా సీబీఐ విచారణ ఇంకా ప్రారంభం కాలేదని తెలుస్తోంది. అయితే సీబీఐ అధికారులు ఢిల్లీలో కేసు పెట్టి.. తెలంగాణ సర్కార్ అనుమతి లేకుండానే విచారణ చేయవచ్చు. ఎందుకనో మరి ఈ విషయంలో సీబీఐ కూడా.. నెమ్మదిగానే ఉంటోంది. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ.. ఈ కేసు విషయంలో చాలా వరకూ లో ప్రోఫైల్ పాటిస్తున్నాయి.