ఖమ్మంలో కేసీఆర్ బహిరంగసభ పెట్టారు. అనుకున్నట్లుగా ఐదు లక్షల మందిని కాకపోయినా… నిండుగా జనం కనిపించేలా సభ నిర్వహించారు. అయితే ఆయన ప్రసంగం మాత్రం ఎప్పటిలా లేదు. జనంలో ఉత్సాహం తెచ్చేలా లేదు. ఆయన మార్క్ మిస్సయింది. పంచ్ లు తగ్గిపోయాయి. ఎందుకిలా అనేది బీఆర్ఎస్లోనే చర్చ జరుగుతోంది. పైగా జాతీయ స్థాయిలో పార్టీ ఆవిర్భావ సభ పెట్టి తెలుగులో ప్రసంగిస్తే జాతీయ మీడియా ఎందుకు కవరేజీ ఇస్తుంది ? అదే జరిగింది. వెబ్ సైట్లలో సభ జరిగింది అని రాయడం తప్ప.. బీఆర్ఎస్ పార్టీ హిందీ బెల్ట్ లో కూడా పోటీ చేస్తుంనదన్న ఫీలింగ్ కలిగించలేకపోయారు.
అయితే కేసీఆర్ తన లక్ష్యాన్ని ముందుగా.. తెలంగాణగా నిర్ణయించుకున్నారని అందుకే ఇలా చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఈ సారి తెలంగాణ సెంటిమెంట్ కు బదులుగా..తెలంగాణ బిడ్డ జాతీయ రాజకీయాలన్నట్లుగా కవర్ చేసుకున్నారు. మోదీ తమ వాడు అన్న కారణంతో వంద శాతం పార్లమెంట్ సీట్లు గుజరాత్ ప్రజలు బీజేపీకే కట్టబెడుతున్నారు. భారత రాష్ట్ర సమితి తొలి ఆవిర్భావ సభను ఖమ్మంలో నిర్వహించడం ద్వారా కేసీఆర్ గుజరాత్లో మోదీ స్థాయి ఆదరణను.. తెలంగాణలో తాను పొందాలని అనుకుంటున్నారు. జాతీయ నేతల సమక్షంలో కేసీఆర్ ప్రసంగం అంతే ఉందని అంటున్నారు.
ఖమ్మం సభ ద్వారా తాను జాతీయ స్థాయికి వెళ్తున్నానని లోకల్లో అందరూ మద్దతుగా ఉండాలన్న ఓ అభిప్రాయాన్ని ప్రజల మనసులో పెట్టాలనుకున్నారని రాజకీయవర్గాలుఅంచనా వేస్తున్నాయి. ఖమ్మం సింహగర్జన సభ ఎఫెక్ట్ ను రాజకీయంగా ఎంత మేర ఉపయోగించుకుంటారన్నది కేసీఆర్ ముందు ముందు తీసుకుబోయే నిర్ణయాలు.. వేయబోయే అడుగులు… పార్టీ నేతల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుంది. ఓ సభ నిర్వహించి.. ఇదే బలం అని చూపించుకోవచ్చు కానీ.. దాన్నే చూపించి బలపడిపోయామని నిర్ణయానికి రాలేరు. కేసీఆర్ తీరు చూస్తూంటే వీలైనంత త్వరగా తెలంగాణలో ఎన్నికలు పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్లుగా చెబుతున్నారు.