ఈ సంక్రాంతి టాలీవుడ్ కి సాఫీగానే సాగిపోయింది. వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఒకటి యావరేజ్, ఇంకోటి హిట్ జాబితాలో చేరిపోయాయి. ఈ రెండు చిత్రాలూ వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాయని నిర్మాతలు ప్రకటించారు. డబ్బింగ్ సినిమాల్లో వారసుడు రిజల్ట్ కాస్త బెటర్‌గా ఉందంతే! తెలుగు నాట సంక్రాంతి కీలకమైన సీజన్. యేడాది ప్రారంభం కాబట్టి.. ఈ సీజన్‌పై టాలీవుడ్ చాలా ఆశలు పెట్టుకొంటుంది. దానికి తగ్గట్టే ఈ సంక్రాంతికి టాలీవుడ్ పాస్ అయిపోయింది. ఇప్పుడు తరువాత రాబోతున్న సినిమాలపై దృష్టి పడింది.
సంక్రాంతి తరవాత కూడా పెద్ద సినిమాల జోరు కనిపిస్తుంటుంది. అయితే ఈ సారి… పెద్ద సినిమాలేం లేవు. అన్నీ చిన్న, మధ్యతరగతి చిత్రాలేవిడుదలకు రెడీ అవుతున్నాయి. ఈనెలలో బుట్టబొమ్మ, హంట్ సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. వచ్చే నెలలో సార్, శాకుంతలమ్ చిత్రాలు వస్తున్నాయి. మళ్లీ పెద్ద హీరోలు, పెద్ద సినిమాల హడావుడి చూడాలంటే.. వేసవి సీజన్ వరకూ ఆగాలి. చిరు భోళాశంకర్, రవితేజ రావణాసుర, పవన్ కల్యాణ్ వీరమల్లు, నాని నటించిన దసరా ఇవన్నీ వేసవికే రాబోతున్నాయి. వీటి మధ్య చిన్న, మీడియం సినిమాలలే చిత్రసీమకు ఆధారం. కాకపోతే వాటిలో కొన్ని క్రేజీ సినిమాలున్నాయి. వాటి ఫలితాల గురించి టాలీవుడ్ ఆశగా ఎదురు చూస్తోంది.